ys jagan: బీజేపీతో సంసారం చేస్తున్నప్పుడు బాబుకు హోదా గుర్తుకురాలేదు: వైఎస్ జగన్
- ధర్మ పోరాట దీక్షలతో నాటకాలాడుతున్నారు
- ఆనాడే కేంద్రం నుంచి బయటకు వస్తే హోదా వచ్చేది
- చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే
నాలుగున్నరేళ్లుగా బీజేపీతో చంద్రబాబు సంసారం చేశారని, అప్పుడు బాబుకు హోదా గుర్తుకురాలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విశాఖపట్ణణం జిల్లా చోడవరంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ధర్మ పోరాట దీక్షలతో నాటకాలాడుతున్నారని, ఆనాడే కేంద్రం నుంచి టీడీపీ బయటకు వచ్చి ఉంటే ప్రత్యేకహోదా వచ్చేది కాదా? అని ప్రశ్నించారు.
నర్సీపట్నం-భీమిలి రోడ్డు విస్తరణను పట్టించుకునే నాథుడే లేడని, చంద్రబాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, కేజీ ఉల్లిని రూ.4 కొని, హెరిటేజ్ లో మాత్రం రూ.25కు అమ్ముతున్నారని ఆరోపించారు. ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబునాయుడు దళారీగా వ్యవహరిస్తున్నారని, ఆయన పాలనలో విద్యార్థుల ఫీజులు విచ్చలవిడిగా పెరిగాయని అన్నారు. బాబు బినామీ కాలేజీల్లో ఇంటర్ చదవాలంటే ఏడాదికి రూ.లక్షా అరవై వేలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు దగ్గరుండి మరీ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇరవై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని అన్నారు.
చంద్రబాబు పాలనంతా అవినీతిమయమని, తాళ్లపూడి, పెదమదీనాలో ప్రభుత్వ భూములనూ వదిలి పెట్టలేదని, రూ.54 కోట్ల విలువైన 134 ఎకరాలను టీడీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. జేసీ అగ్రహారంలో 412 ఎకరాలను స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని, ఇసుక ఫ్రీ అని చెప్పి 2 యూనిట్ల ఇసుకను 16 వేలకు అమ్ముతున్నారని, నీరు-చెట్టు కింద పనులు చేయకున్నా చేసినట్లు చూపుతున్నారని ఆరోపించారు.