ntr: డౌట్ లేదు .. దసరాకే 'అరవింద సమేత'

- షూటింగు దశలో 'అరవింద సమేత'
- మళ్లీ షూటింగుకి ఎన్టీఆర్
- అక్టోబర్ 11వ తేదీన విడుదల
త్రివిక్రమ్ దర్శకత్వంలో .. ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం రూపొందుతోంది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే చాలావరకూ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడంతో, ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఎన్టీఆర్ కి కొంత సమయం పట్టొచ్చని అనుకున్నారు. అందువలన కొన్ని రోజుల పాటు షూటింగు ఆపేయవచ్చనీ, ఆ కారణంగా ఈ సినిమా దసరాకి థియేటర్లకు రావడం కష్టమేననే టాక్ వచ్చింది.
దర్శక నిర్మాతలు ఇద్దరూ కూడా మనసు కుదుట పడేంతవరకూ సమయం తీసుకోమనే ఎన్టీఆర్ కి చెప్పారట. కానీ తన వలన షూటింగ్ ఆగిపోకూడదనీ .. విడుదల తేదీ వాయిదా పడకూడదని ఎన్టీఆర్ భావించాడట. అందువలన ఆయన ఈ రోజు షూటింగుకి వచ్చేశాడు. ఎప్పటిలానే ఇక చకచకా షూటింగు కొనసాగనుంది. అందువలన ముందుగా చెప్పిన ప్రకారం ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు సమాచారం.