Andhra Pradesh: అమరావతి బాండ్లకు అద్వితీయ స్పందన: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇమేజ్ పెరిగింది
- రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు వ్యాపార దిగ్గజాలు సిద్ధం
- ఏపీలో పెట్టుబడులకు విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి
అమరావతి బాండ్లకు బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్సీఈ) లో అద్వితీయమైన స్పందన వచ్చినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తెలిపారు. ఏపీ సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2 వేల కోట్ల విలువ గల బాండ్లు జారీ చేసిన గంట వ్యవధిలోనే బీఎస్సీఈలో మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరినట్లు చెప్పారు.
ఆశించిన దానికంటే ఒకటిన్నర రెట్లు సబ్స్క్రైబ్ అయిందని, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఇంత స్పందన వచ్చిందని.. ఇది గొప్ప విజయమని అన్నారు. అమరావతి బాండ్ల విడుదలతో జాతీయ, అంతర్జాతీయ మదుపరుల్లో రాష్ట్ర ఇమేజ్ పెరిగిందని చెప్పారు. ముంబయిలో నిన్న జరిగిన బాండ్ల లిస్టింగ్ (బాండ్లను కొనుగోలు చేసిన సంస్థలకు స్టాక్ మార్కెట్లో ఇతరులకు విక్రయించుకునే వీలు కల్పించడం) కార్యక్రమానికి దేశంలోని వ్యాపార దిగ్గజాలు హాజరైనట్లు తెలిపారు.
ముఖేష్ అంబానీ, గోద్రెజ్, కుమార మంగళం బిర్లా, మహేంద్ర గ్రూప్ ప్రతినిధులు, బీకే గోయంకా, రహేజా సంస్థ ప్రతినిధులు తదితరులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరిచారని, విదేశీ పెట్టుబడిదారులు కూడా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధిని చూసి జీవీఎల్ వంటి వారు ఓర్వలేకపోతున్నారు
ఏపీకి కేంద్రం సాయం చేయకపోయినా చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధిని చూసి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఓర్వలేకపోతున్నారని, ఈర్ష్యతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బాండ్ల విడుదల వ్యవహారం అంతా పారదర్శకంగా జరిగిందని, ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేసినా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కుటుంబరావు తెలిపారు. రుజువు చేయలేని పక్షంలో జీవీఎల్ రాజీనామా చేస్తారా? కనీసం క్షమాపణలైనా చెబుతారా? అని అడిగారు. ఎందుకు ఇలా విషం కక్కుతున్నారో అర్ధం కావడం లేదని, ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారు నష్టపోతారని చెబుతున్నారని, వారు ఎలా నష్టపోతారని కుటుంబరావు ప్రశ్నించారు.
అనిల్ అంబానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని, భారత దేశ ఇమేజ్ దిగజారిందని, అటువంటి కంపెనీలకే కేంద్రం డిఫెన్స్ కు సంబంధించిన భారీ కాంట్రాక్టులు ఇస్తూ మద్దతుగా ఉంటున్న విషయాన్ని కుటుంబరావు ప్రస్తావించారు. గుజరాత్ లో నష్టాల్లో, పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన జీఎస్పీసీని ఓఎన్జీసీ చేత కొనుగోలు చేయించడంపై విమర్శలు గుప్పించారు. బీహార్ లో శ్రీజమ్ స్కామ్ భారీ స్థాయిలో జరిగిందని, అటువంటి అంశాలను జీవీఎల్ వంటి వారు ఎందుకు ప్రశ్నించరని అన్నారు.
అమరావతి బాండ్లపై అర్థంపర్థంలేని ఆరోపణలు తగవు
అమరావతి బాండ్ల వడ్డీ రేటు, ఎరేంజర్ ఫీపై కూడా అర్ధంపర్ధంలేని విమర్శలు చేస్తున్నారని, నిబంధనల ప్రకారమే ఆ చెల్లింపులు జరిగాయని, ఎక్కువ ఇవ్వడంలేదని కుటుంబరావు స్పష్టం చేశారు. సంస్థల రేటింగ్ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారని, ‘ట్రిపుల్ ఏ’, ‘డబుల్ ఏ’, ‘ఏ’, ‘ఏ ప్లస్’ వంటి రేటింగ్ ల ఆధారంగా వడ్డీ రేటు ఉంటుందని తెలిపారు. ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ ఉన్న పవర్ గ్రిడ్, ఆర్ఈసీ వంటి రూ.20 వేల కోట్లు రిజర్వు ఫండ్స్ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూడు నెలల క్రితం 9.49 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేసినట్లు వివరించారు.
నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఎస్పీసీ విస్తరణ కోసం రూ.1000 కోట్లకు బాండ్లు విడుదల చేశారని, వాటి వడ్డీ రేటు 10.45 శాతం అని, ఎరేంజర్ ఫీ 1.5 శాతం అని తెలిపారు. వాటి కాల పరిమితి 60 ఏళ్లని, ఆ తరువాత జీఎస్సీసి గ్యాస్ పంపిణీ కోసం విడుదల చేసిన బాండ్లకు వడ్డీ రేటు 10.30 శాతం, ఎరేంజర్ ఫీ 1.5 శాతం అని స్పష్టం చేశారు. అమరావతి కోసం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టాక్స్ ఫ్రీ బాండ్లకు అనుమతి ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడంలేదని, 2014 నుంచి తాము ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ప్రత్యేక అంశంగా భావించి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఎన్ హెచ్ఏ, పవర్ ఫైనాన్స్ వంటి సంస్థలకు టాక్స్ ఫ్రీ బాండ్లకు అనుమతి ఇస్తుందని అన్నారు.
సీఆర్డీఏ సమర్థవంతంగా వ్యవహరిస్తోంది
దేశంలోని అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ రాజధాని అమరావతి అని, ఈ ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణ వ్యయం రూ.48,115 కోట్లుగా కుటుంబరావు పేర్కొన్నారు. మొత్తం 56 ప్రాజెక్టులని, వాటిలో 36 మొదలయ్యాయని, అమరావతి అభివృద్ధి పనులను చేపట్టడంలోగానీ, నిధులు సమకూర్చుకోవడంలో గానీ సీఆర్డీఏ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని కుటుంబరావు ప్రశంసించారు. చేయగలిగిన పనులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే సీఆర్డీఏ విడతలవారీగా అప్పులు సేకరిస్తోందని, నిధుల కొరత లేకుండా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నట్లు తెలిపారు. తక్కువ కాలంలో ఎక్కువ నిధులు సేకరిస్తోందని, వచ్చే ఏడాది నుంచి సీఆర్డీఏకు ఆదాయం కూడా మొదలవుతుందని చెప్పారు. ప్లాట్లు పంపిణీ చేస్తున్నారని, యూజర్, అనుమతుల ఛార్జీలు వస్తాయని, అది స్వయంసమృద్ధి దిశగా వెళుతోందని అన్నారు.
పీడీ ఖాతాలను కూడా తరచూ విమర్శించడం అలవాటైపోయిందని, రాష్ట్రంలో సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) విధానం ద్వారా ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నట్లు కుటుంబరావు స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై విమర్శలలో కూడా వాస్తవం లేదని, ఒక్క నెలకు మించి బకాయిలు పెండింగ్ లో లేవని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. బయటివారికే నమ్మకంలేదని, అమరావతి నగరం అద్వితీయంగా రూపొందుతుందని ఈ సందర్భంగా కుటుంబరావు స్పష్టం చేశారు.