Tamilnadu: ఆస్తి కోసం కొడుకుతో కలసి భర్తకు చిత్రహింసలు!

  • తమిళనాడులోని ఈరోడ్ లో దారుణం
  • ఆస్తి ఇవ్వాలంటూ వేధింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

కట్నం వేధింపులు, గృహ హింస, సూటిపోటి మాటలు .. ఇలా ఇళ్లలో జరిగే వేధింపుల్లో సాధారణంగా మహిళలే బాధితురాళ్లుగా ఉంటారు. తమ భర్తలు పెట్టే వేధింపులను కొందరు సైలెంట్ గా భరిస్తే.. మరికొందరేమో పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ తమిళనాడులో మాత్రం సీన్ రివర్స్ అయింది. భార్య వేధింపులను చివరివరకూ భరించిన భర్త ఇక బాధ తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన రమేశ్(50)కు భార్య లలిత(45), కుమారుడు శ్రీధర్ ఉన్నాడు. అయితే రమేశ్ పేరు మీద బ్యాంకులో రూ.2 కోట్ల నగదు ఉంది. అంతేకాకుండా ఇళ్లు, షాపులపై నెలకు రూ.30 వేల వరకూ అద్దెలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లీకొడుకులు కలసి ఆస్తి తమ పేరున రాసివ్వాలని రమేశ్ ను డిమాండ్ చేశారు.

దీనికి రమేశ్ ఒప్పుకోకపోవడంతో వారం రోజులుగా చిత్రహింసలు పెట్టారు. ఆదివారం రమేశ్ అరుపులు విన్న చుట్టుపక్కలవారు బంధువులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న దూరపు బంధువు గోపాల్ ఆయన్ను ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు భార్య కుమారుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

More Telugu News