jagapathiabu: నా జాతకం చూసినవాళ్లు ఏదైతే చెప్పారో .. అదే జరిగింది: జగపతిబాబు
- ఇప్పుడు నేను హీరోను కాదు
- ఓపెనింగ్స్ గురించిన ఆలోచన లేదు
- నాకు టెన్షన్ లేకుండా పోయింది
హీరోగాను .. విలన్ గాను మంచి మార్కులు కొట్టేసిన జగపతిబాబు, ప్రస్తుతం చాలా బిజీగా వున్నారు. తాజాగా ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన అనుభవాలను గురించి ప్రస్తావించారు. "30 .. 40 సంవత్సరాల క్రితం నేను తమిళనాడులోని ఓ ప్రదేశంలో జాతకం చూపించుకున్నాను. హీరోగా చిత్రపరిశ్రమలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాననీ .. ఆ తరువాత 2018లో అవకాశాలు పెరిగి మంచి పొజీషన్ వస్తుందని వాళ్లు తాళపత్రాలు చూసి చెప్పారు.
అప్పట్లో వాళ్లు ఏదైతే చెప్పారో .. అదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు నేను హీరోను కాదు గాబట్టి .. నాపై పెద్ద బాధ్యత లేదు. సినిమా ఆడుతుందా లేదా .. ఓపెనింగ్స్ వస్తాయా? లేదా? అనే టెన్షన్స్ కూడా నాకు ఇప్పుడు లేవు. ఒకవేళ సినిమా ఆడకపోతే డబ్బులు తిరిగిచ్చేది కూడా వుండదు. నేను హీరోగా చేస్తున్నప్పుడు షూటింగు ఆగిపోయినా .. సినిమా ఆడకపోయినా డబ్బులు తిరిగిచ్చేవాడిని. నా వలన నిర్మాతలు నష్టపోకూడదనే అలా చేసేవాడిని" అని చెప్పుకొచ్చారు.