love marriage: ప్రేమ జంటపై పగబట్టిన ఊరు.. అందరూ ఏకమై బహిష్కరించారు!

  • విశాఖలోని చోడవరంలో దారుణం
  • వేరే కులస్తుడిని పెళ్లాడటంపై పెద్దల ఆగ్రహం
  • ఊరు విడిచిపెట్టిన కుటుంబం

పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి? ముందు అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చాలి. ఇంకా ఇరు కుటుంబాలు ఇందుకు అంగీకరించాలి. ఇంతకంటే ఏం కావాలని అనుకుంటున్నారా? ఊర్లో అందరూ ఆ పెళ్లికి ఒప్పుకోవాలి. ఇంట్లో పెళ్లికి ఊర్లో అందరూ ఒప్పుకోవడం ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే, తమకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నారని ఓ ప్రేమ జంటను, ఆ కుటుంబాన్ని కొందరు పెద్దలు ఊరి నుంచి బహిష్కరించారు.

విశాఖ జిల్లా చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామంలో గణేశ్ వరప్రసాద్, విస్సారపు రూప పక్కపక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. వరప్రసాద్ కుటుంబం వేరే ప్రాంతం నుంచి కొన్నేళ్ల క్రితం ఈ గ్రామానికి వలస వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారం రోజుల క్రితం ఊరి నుంచి వెళ్లిపోయిన ఈ జంట అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వివాహం చేసుకుంది. తిరిగి శనివారం ఊరిలోకి అడుగుపెట్టగానే దుడ్డుపాలెం పెద్దలు ఈ జంటపై కత్తిగట్టారు.

గ్రామస్తులందరూ ఒకే సామాజికవర్గం కావడం, రూప బయటివాడిని పెళ్లి చేసుకోవడం నచ్చని గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. అనంతరం ప్రేమికులతో పాటు ప్రసాద్ తల్లిదండ్రులను ఊరి నుంచి బహిష్కరించారు. దీంతో ఆ కుటుంబం ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ విషయమై మీడియా ప్రతినిధులు గ్రామపెద్దలను సంప్రదించగా.. పెళ్లి విషయమై పంచాయితీ పెట్టిన మాట వాస్తవమనీ, తాము ఆ కుటుంబాన్ని బహిష్కరించలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News