kcr: ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్

- కొంగరకలాన్ వెళ్లి సభా స్థలి పరిశీలన
- సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై ఆరా
- ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశం
హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్ లో వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ అక్కడికి వెళ్లారు. సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను అక్కడున్న నేతలను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సభకు హాజరయ్యే టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి సభా వేదికకు రావడానికి అనుగుణంగా అన్ని వైపుల నుంచి 15 నుంచి 20 రహదారులు నిర్మించాలని, కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకోవాలని, ఇందుకోసం పార్టీ నిధులనే వినియోగించాలని కేసీఆర్ సూచించారు.
