Telugudesam: టీడీపీలోకి కాంగ్రెస్ మాజీ నేతలు?
- సీఎం చంద్రబాబుతో ఉగ్రనరసింహారెడ్డి భేటీ
- టీడీపీలో చేరే అంశంపై మంతనాలు?
- తెలుగుదేశం పార్టీలోకి కొండ్రు మురళి?
ఏపీ టీడీపీలోకి కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సీఎం చంద్రబాబుతో ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ క్రమంలో కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావునూ టీడీపీ అధిష్ఠానం సంప్రదించింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి ఇప్పటికే మంత్రి కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. రాజాం టిక్కెట్ ను కొండ్రు మురళి ఆశిస్తున్నారు. అయితే, టీడీపీలోకి కొండ్రు మురళి రాకను ఆ పార్టీ సీనియర్ నేత ప్రతిభా భారతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలోకి మురళి వస్తే తనకు ఇబ్బందులు ఉంటాయని ప్రతిభా భారతి భావిస్తున్నట్టు సమాచారం.