Chandrababu: ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ బలహీనంగా ఉండకూడదు: సీఎం చంద్రబాబు
- పార్టీ ముఖ్యనేతలతో పలు అంశాలపై చంద్రబాబు చర్చ
- కలిసికట్టుగా పని చేస్తే ఫలితాలు సాధించవచ్చు
- ‘మళ్లీ నువ్వే రావాలి’ కాన్సెప్ట్ ను ప్రచారం చేయాలి
ఏపీలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీ బలహీనంగా ఉండకూడదని సీఎం చంద్రబాబునాయుడు తమ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో పలు అంశాలపై చంద్రబాబు ఈరోజు చర్చించారు. ఒకరుగా ఏదీ చేయలేరని, కలిసికట్టుగా పని చేస్తేనే ఫలితాలు వస్తాయని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వ, పార్టీ సేవల్లో నాణ్యత పెరిగిందనే భావన ప్రజల్లో రావాలని, ప్రభుత్వం యంత్రాంగం ఒక బృందంగా పని చేసినందువల్లే 511 అవార్డులు వచ్చాయని, అదేవిధంగా, పార్టీలో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం చేయాలని, 795 బూత్ కమిటీల కన్వీనర్లను వెంటనే నియమించాలని, సెప్టెంబర్ నాటికి వారికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
‘మళ్లీ నువ్వే రావాలి’ కాన్సెప్ట్ ను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని, నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై ఈ నెల 25న కర్నూలులో ధర్మపోరాట సదస్సు, ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా..టీడీపీ హమారా’ మైనారిటీ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాల వారీగా పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని, ఈ పనుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని, త్వరలో బూత్ కమిటీ కన్వీనర్లు, సేవా మిత్రలు, పార్టీ బాధ్యులతో భేటీ కానున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి మంత్రి నెలలో రెండు రోజులు రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలని, తమ శాఖల్లో సాధించిన పురోగతిపై చర్చించాలని ఆదేశించారు.