jonnavitthula: 'శ్రీరామరాజ్యం' పాటల విషయంలో అలా జరిగింది: జొన్నవిత్తుల
- బాపు .. రమణలు మనుషుల్లో రుషులు
- వాళ్లతో మంచి సాన్నిహిత్యం వుంది
- వాల్మీకికి నమస్కరించుకుని పాటలు రాశాను
కవిగా పద్యాలతోను .. పాటలతోను జొన్నవిత్తుల ఎంతోమంది మనసులను దోచుకున్నారు. అలాంటి ఆయన తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. బాపూ .. రమణల గురించి ఆయన ప్రస్తావిస్తూ .. "వాళ్లు మనుషుల్లో రుషులు .. వాళ్లు మనతో చాలా సరదాగా మాట్లాడతారుగానీ, వాళ్ల ఆలోచనా విధానం వేరు.
'భాగవతం' ధారావాహికకి నేను కొన్ని పద్యాలు రాసిన కారణంగా, 'శ్రీరామరాజ్యం' సినిమాకి పద్యాలు .. పాటలు రాయడానికి వాళ్లిద్దరూ నన్ను పిలిపించారు. నేను 4 రోజుల పాటు ఏమీ రాయలేదు .. దాంతో బాపూ గారు "ఎందుకండీ మీరొచ్చి ఇక్కడ కూర్చున్నారు .. ఏమీ రాయడం లేదు .. మీకు సమయం వృథా .. నిర్మాతకి డబ్బులు దండగా" అన్నారు.
'మీరు రాయమన్నది ఏదో ఒక పాట కాదండి .. లవకుశుల పాటలు. పెన్ను పెట్టాలంటే ఎంతో ప్రేరణ కావాలి. రేపు ఒక రోజు నాకు సమయం ఇవ్వండి .. మౌన దీక్ష చేపట్టి ఎల్లుండి రాసుకొస్తాను .. నచ్చితేనే తీసుకోండి' అన్నాను. 'మీరు రాయగలరు .. మాకు నమ్మకం వుంది .. రాసుకుని రండి' అన్నారు. అక్కడి నుంచి వచ్చేసి మరుసటి రోజు రామాయణానికి పూజచేసి .. వాల్మీకి మహర్షికి మనసులోనే నమస్కరించుకుని రాసాను' అని చెప్పుకొచ్చారు.