Fakedoctor: కర్నూలులో నకిలీ వైద్యుడి ప్రాక్టీస్... అరెస్ట్ చేసిన పోలీసులు
- డాక్టర్ లా చలామణి అవుతున్న నకిలీ వైద్యుడు
- ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న దొంగ డాక్టర్
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విజిలెన్స్ అధికారి
పదోతరగతి చదివి ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్, మెడికల్ షాపును నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ కథ ఇది. కర్నూలు నగరంలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి, అబార్షన్ లు చేస్తున్న ఈ నకిలీ వైద్యుడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ నకిలీ వైద్యుడ్నివిజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు.
కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న వై.వేణుగోపాల్‌శెట్టి పదో తరగతి మాత్రమే చదివాడు. స్థానిక బళ్లారి చౌరస్తాలో కేకేహెచ్ హాస్పిటల్, మెడికల్ షాపుతో పాటు ప్రకాష్‌నగర్‌లోని తన ఇంట్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. జిల్లాలోని పలువురు ఆర్‌ఎంపీలు ఇతని వద్దకు గర్భిణులను తీసుకొచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్ఈవో బాబూరావు పేషెంట్ తరఫు వ్యక్తిలా వెళ్లి .. వేణుగోపాల్ శెట్టి స్కానింగ్ చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆస్పత్రితో పాటు స్కానింగ్ మిషన్ ను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.