Genetics: తండ్రి మరణించిన మూడేళ్ళకు కుమారుడి జననం.. సాకారమైన కల

  • భర్త మరణించినా సరోగసీ ద్వారా సంతాన ప్రాప్తి పొందిన భార్య
  • భర్త వీర్య కణాలతో ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం కోసం ప్రయత్నం 
  • భర్త మరణించిన మూడేళ్ళకు ఫలించిన ప్రయత్నం... ఒడిలో వంశాంకురం

వైద్య విధానంలో సాంకేతిక పరిజ్ఞానం చేసిన అద్భుతమిది. ప్రాణంగా ప్రేమించిన భర్త దూరమైనా ఆయన వంశం కోసం మూడేళ్ళ పాటు ఒక భార్య పడిన వేదన ఇది. ప్రమాదంలో భర్త మరణించక ముందు పిల్లల కోసం ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఇచ్చిన వీర్యంతో... మూడేళ్ళ ప్రయత్నం తరువాత వంశాంకురాన్ని ఒడిలో చేర్చుకుందంటే వారి మధ్య ఉన్న ప్రేమ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.    

బెంగుళూరుకు చెందిన సుప్రియ జైన్, గౌరవ్ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకునే వారు. పెళ్లయి ఐదేళ్ళయినా వారికి సంతాన భాగ్యం కలగలేదు. దీంతో ఇక ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ఆ ప్రయత్నం చేస్తుండగానే ఊహించని దారుణం జరిగింది. హుబ్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరవ్ మృతి చెందారు.

అయినా సరే, గౌరవ్ గుర్తుగా సంతానం కావాలని నిర్ణయించుకున్న సుప్రియ.. అప్పటికే ఐవీఎఫ్ ప్రక్రియ కోసం ఇచ్చిన గౌరవ్ వీర్యంతో సరోగసీ ద్వారా బిడ్డ కోసం డాక్టర్ ఫిరుజను కలిశారు. గౌరవ్ వీర్యకణాలను పరీక్షించిన వైద్యురాలు సరోగసీ ద్వారా చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు మూడేళ్ళకు ప్రయత్నం ఫలించి మగబిడ్డ పుట్టాడు. ప్రేమించిన భర్త ఊహించని రీతిలో విషాదంలో ముంచి ఒంటరిని చేసి వెళ్ళిపోతే...  ఆమె ప్రేమ తిరిగి గౌరవ్ బిడ్డగా ఒడిని చేరింది. తాము కన్న కల నెరవేరకుండానే గౌరవ్ లోకం వీడి పోయినా, గౌరవ్ వంశాంకురాన్ని చూసి సుప్రియ జైన్ మురిసిపోతోంది.

సుప్రియకు విధి నిర్ణయంపై గట్టి నమ్మకం ఉంది. దైవ నిర్ణయాన్ని బట్టే అన్నీ జరుగుతాయని ఆమె విశ్వసిస్తుంది. కాబట్టే ఇంతగా ప్రయత్నించారు. ఐవీఎఫ్ ప్రక్రియ కూడా అదే విధంగా జరిగిందని అనుకున్నారు. ఇరువైపుల కుటుంబాలను సంప్రదించకుండానే స్వయంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రియమైన గౌరవ్‌ సంతానం తప్పకుండా ఈ లోకంలోకి రావాలని నిర్ణయించుకున్న సుప్రియ ముంబైలోని డాక్టర్ ఫిరుజ పారిఖ్‌ను సంప్రదించి గౌరవ్ బిడ్డ తనకు కావాలని కోరారు. చాలా ప్రయత్నాలు చేసిన డాక్టర్ ఇది చివరి ప్రయత్నం అని చెప్పారు. ఆ చివరి ప్రయత్నం ఫలించింది. గౌరవ్ వారసుడు సుప్రియ ఒడిని చేరాడు.

More Telugu News