: కడియం అప్పుడే జంప్ చేయాలనుకున్నారు
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, కీలక నేతల్లో ఒకరైన కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కడియం లోగడ టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదల, సాంఘీక సంక్షేమ శాఖల మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ప్రాంతంలో కీలక నేతల్లో ఒకరుగా ఉన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ దూకుడు ఎక్కువ కావడం 2004 ఎన్నికల్లో ఘన్ పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత విజయరామారావు చేతిలో ఓటమి పాలవడం కడియంలో మార్పునకు కారణమైంది. తెలంగాణ విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యాయని ఆయనలో ఆవేదన గూడు కట్టుకుంది.
ఒక దశలో టీఆర్ఎస్ లోకి జంప్ కావడానికి ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. చంద్రబాబు రంగంలోకి దిగి సముదాయించడంతో కడియం వెనక్కి తగ్గారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాలో భాగంగా 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కడియం అదే ఘన్ పూర్ స్థానంలో గెలిచారు. మళ్లీ 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెందిన టి.రాజయ్య చేతిలో కడియం పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కడియంలో అంతర్మథనం మొదలైంది. టీఆర్ఎస్ లోకి వెళితేనే రాజకీయంగా మనగలుగుతాననే అభిప్రాయానికి వచ్చారు. క్రమక్రమంగా పార్టీకి దూరం జరుగుతూ ఈ రోజు గుడ్ బై కొట్టేశారు.