: టీడీపీని ఏకిపారేసిన కడియం
తెలుగుదేశం పార్టీలో చాలా లోపాలున్నాయంటూ ఆ పార్టీకి రాజీనామా సమర్పించిన సీనియర్ నేత కడియం శ్రీహరి ఆరోపణలు చేశారు. పనిలోపనిగా పార్టీ నాయకత్వ తీరును చీల్చి చెండాడారు. పార్టీలు మారేవారికి, పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999 నుంచీ టీడీపీ నాయకత్వ తీరులో మార్పు వచ్చిందని.. అందుకే రెండు సార్లు ఓటమి పాలైందని చెప్పారు. కొన్ని పార్లమెంటరీ, శాసన సభ నియోజకవర్గాలకు ఇప్పటికీ ఇన్ చార్జ్ లు లేరని చెప్పారు. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే తరహాలో వ్యవహరిస్తున్నారని, నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని విమర్శించారు. పదవులను అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పార్టీ గుర్తించడం లేదని వివరించారు.
టీడీపీని, చంద్రబాబు నాయుడిని తెలంగాణ ఉద్యమం వైపు తీసుకురావడంలో విఫలమయ్యానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికే రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కడియం చెప్పారు. చివరిగా టీడీపీ తనకు అన్యాయం చేయలేదని కడియం స్పష్టం చేశారు.