Tatamotors: దేశీయ మార్కెట్ లో దుమ్మురేపే ప్లాన్ తో టాటా మోటార్స్!
- దేశీయ మార్కెట్ లో దూసుకుపోవాలనే లక్ష్యంతో టాటా మోటార్స్
- ఈ ఆర్ధిక సంవత్సరం చివరి క్వార్టర్లో హారియర్ ఎస్యూవీ విడుదల
- రానున్న ఐదేళ్లలో 10 నుండి12 కొత్త ఉత్పత్తులు
రానున్న కాలంలో మారుతున్న వాహన అవసరాలకు అనుగుణంగా టాటా మోటార్స్ తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. రానున్న ఐదేళ్ళలో నూతన ఉత్పత్తులను తీసుకురానుంది. రెండు నూతన మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌లలో 10 నుంచి 12 వాహనాలను తీసుకురానున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, వ్యయాన్ని తగ్గించుకుని లాభార్జన కోసం కూడా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయనుంది.
దేశీయ ఆటోమోటివ్ మార్కెట్ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో టాటా మోటార్స్ మార్కెట్ లో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో 10–12 కొత్త రకం కార్లను మార్కెట్ లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆల్ఫా, ఒమెగా అనే రెండు ప్లాట్‌ఫామ్‌లపై ఈ కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయనున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది.
అంతేకాకుండా కంపెనీని లాభాల బాటలో నడిపించేందుకు ఖర్చు తగ్గించుకునే ప్లాన్ చేయనుంది. కేవలం రెండే ప్లాట్ ఫారంలతో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 4.3 మీటర్ల పొడవుతో ఆల్ఫా ప్లాట్ఫామ్లో కొన్ని వాహనాలను, ఎస్‌యూవీలు, పెద్ద వాహన ఉత్పత్తులను ఒమెగా ప్లాట్‌ఫామ్ నుంచి తీసుకురానుంది. ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎస్‌యూ వీ హారియర్‌ను విడుదల చేసి కొత్త ఉత్పత్తుల విడుదల వేగాన్ని పెంచాలని భావిస్తోంది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విడిభాగాల సరఫరాదారులను 600 నుంచి 400కు తగ్గించుకునే ఆలోచనలో ఉంది. నానో విడిభాగాల సరఫరా కేంద్రాలను వాహనాలకు విడిభాగాలను అందించే విధంగా అభివృద్ధి చేసింది. సనంద్ ప్లాంట్‌లో అక్టోబర్ నుంచి టియాగో, టిగోర్ వాహనాలను నెలకు 12,500 యూనిట్ల తయారీకి తీసుకెళ్లనుంది. టర్న్ అరౌండ్ విధానంలో భాగంగా సరఫరాదారులను క్రమబద్ధీకరించి లాభార్జనే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో దేశీయ మార్కెట్ లో నిలబడాలని యత్నిస్తోంది టాటా మోటార్స్.