India: ఇండియా జలయుద్ధానికి సిద్ధపడుతోందంటూ తీవ్రంగా భయపడుతున్న పాకిస్థాన్!

  • ఇండస్ నదిపై వేగంగా పూర్తవుతున్న ఆనకట్టలు
  • మే 16న జాతికి అంకితమైన కృష్ణ గంగా ప్రాజెక్టు
  • ఇప్పటికీ పూర్తి కాని పాక్ కేబీడీ ప్రాజెక్టు
  • భూములు బీడు పడతాయన్న ఆందోళనలో పాక్
  • ఒప్పందాలను భారత్ అతిక్రమిస్తోందన్న పాక్ మంత్రి అలీ జాఫర్

పాక్ సరిహద్దుల్లో ఉన్న ఇండస్ నదిపై శరవేగంగా ఆనకట్టలు కడుతున్న భారత వైఖరిని చూసి పాకిస్థాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్ తదితర ప్రాంతాలకు ప్రధాన నీటివనరులుగా ఉన్న పంచ నదులపై భారత్ ఎగువ భాగంలో, ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ లో డ్యామ్ లు కడుతుండటం పాక్ కు మింగుడు పడటం లేదు.

ఈ సంవత్సరం మే 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణ గంగా హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాక్ లో నిర్మాణ దశలో ఉన్న కలాబాగ్ డ్యామ్ (కేబీడీ) ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ పూర్తయినా, నీరు రావాలంటే, ఇండియాను దాటుకునే నీరు రావాలి. దీంతో తమ భూభాగం, ముఖ్యంగా పొలాలు ఎండిపోతాయని, ప్రజలకు తాగేందుకు కూడా నీరు దొరకదని భయపడుతున్న పాక్, గతంలో చేసుకున్న ఒప్పందాలను భారత్ అతిక్రమిస్తూ, తమతో 'జలయుద్ధం' చేస్తోందని ఆరోపించింది.

ఇటీవల మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ జలవనరుల పరిరక్షణా శాఖ మంత్రి అలీ జాఫర్, ఇండియాపై విమర్శలు గుప్పించారు. ఒప్పందాలను తుంగలో తొక్కి సరిహద్దుల్లో పలు ప్రాజెక్టులను భారత్ నిర్మిస్తోందని ఆరోపించారు. ఈ డ్యాముల నిర్మాణం పూర్తయితే, పాకిస్థాన్ బీడు భూమిగా మారుతుందని అన్నారు. ఇండస్ నీటి ఒప్పందం తరువాత, సట్లేజ్, బియాస్, రావి నదులపై దాదాపు 400 డ్యాములు, రిజర్వాయిర్లను భారత్ నిర్మించిందని, పాక్ కనీసం కేబీడీని కూడా పూర్తి చేయలేకపోయిందని, ఈ డ్యామ్ ను అత్యంత ప్రాధాన్యతా నిర్మాణం జాబితాలో చేర్చి త్వరితగతిన పూర్తి చేయాల్సి వుందని ఆయన అన్నారు.

More Telugu News