: ఎడబాటు అయినంతనే.. ఎదలోతుల్లో తొలగిపోరు...
ఇది మంచో చెడో అంత సులువుగా తేల్చిచెప్పడం కష్టం గానీ.. మొత్తానికి ఇది కూడా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల వల్ల వస్తున్న సామాజిక, మానసిక పరిణామమే. అదేంటంటే.. మనకు ఒకప్పుడు ఆప్తులుగా ఉన్న వారితో విడిపోయినా, వారితో తగాదా పెట్టుకుని మన ఫేస్‌బుక్ ఖాతాల్లో బ్లాక్ చేసేసినా కూడా.. ఆ తర్వాత కూడా వారిని పూర్తిగా మరచిపోవడం మాత్రం అంత ఈజీగా సాధ్యం కాదుట. బోలెడంత మంది యువతరం ప్రతినిధుల మీద పరిశోధనలు, అధ్యయనాలు సాగించిన మానసిక శాస్త్రవేత్తలు ఈ విషయం చెబుతున్నారు.
ప్రస్తుతం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల హవా నడుస్తోంది. ఈ రోజుల్లో చాలా భారీ స్థాయిలో ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, ఇలాంటి పరస్పర అనుబంధానికి ప్రతీకలైన అనేక అంశాలను యువతరం ఆన్‌లైన్‌లో పదిలంగా దాచుకుంటోంది. అలాంటి నేపథ్యంలో వ్యక్తులతో విడిపోయినంత మాత్రాన .. వారికి సంబంధించిన జ్ఞాపకాల్ని సమూలంగా తుడిచిపెట్టేయడం సాధ్యం కాదని శాంతాక్రజ్‌కు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ విటేకర్ స్టడీ తేలుస్తోంది. డిజిటల్ యుగంలో వచ్చిన ఆధునిక పరిణామం ఇదన్నమాట.