NRC: ‘30 ఏళ్లు భారత సైన్యంలో పనిచేశా.. నేను భారతీయుడిని కానా?’ అసోంలో ఓ ఆర్మీ అధికారి ఆవేదన

  • ఆధారాలున్నా మా పేర్లను చేర్చలేదు
  • కేంద్రం సాయాన్ని కోరుతున్నాం
  • జేసీవో మొహమ్మద్ హక్ వెల్లడి

అసోంలో ప్రకటించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) దాదాపు 40 లక్షల మందిని స్థానికులుగా గుర్తించకపోవడం అక్కడ తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది. పేర్లు గల్లంతయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ అధికారులతో పాటు సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువులు కూడా ఉండటంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. 

తాజాగా భారత సైన్యంలో 30 ఏళ్ల పాటు సేవలు అందించిన ఓ అధికారి తన మొత్తం కుటుంబం వివరాలు ఎన్నార్సీ జాబితాలో గల్లంతు కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోంకు చెందిన మొహమ్మద్ ఏ హక్ భారత సైన్యంలో 1986 నుంచి 2016 వరకూ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో)గా పనిచేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అసోంలో ఇటీవల విడుదల చేసిన ఎన్నార్సీలో తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు గల్లంతు కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘నేను భారత సైన్యంలో 30 ఏళ్లు పనిచేశాను. నాతో పాటు నా కుటుంబ సభ్యుల పేర్లు ఎన్నార్సీ జాబితాలో లేకపోవడంతో చాలా బాధ కలిగింది. నేను దేశం కోసం అంకితభావంతో పనిచేశాను. నా తల్లిదండ్రులకు సంబంధించిన వారసత్వ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి’ అని హక్ డిమాండ్ చేశారు. తన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు హక్ పేర్కొన్నారు. 1971, మార్చి 25కు ముందు అసోంలో ఉన్న స్థానికులు, వారి సంతానాన్ని మాత్రమే ఈ ఎన్నార్సీ జాబితాలో చేర్చారు.

More Telugu News