Chandrababu: ఏపీలో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలతో సత్ఫలితాలు: పూనం మాలకొండయ్య

  • 222 కేంద్రాల ద్వారా వైద్య సేవలు
  • 61.67 లక్షల మందికి అందిన వైద్యం
  • ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై ప్రజలు సంతృప్తి 

పట్టణ, నగర ప్రజలకు నాణ్యమైన, ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందించే ఉద్దేశ్యంతో గత ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆరోగ్య కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న 222 ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల (ఈయూపీహెచ్సీ) ద్వారా నేటి వరకూ పట్టణ ప్రజలకు రూ.733.61 లక్షల విలువ చేసే సేవలు అందించామని పేర్కొన్నారు. ఈ కేంద్రాలకు వచ్చే రోగులకు పరీక్షల నిమిత్తం 30 లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొచ్చిందని, అప్పటికే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించి, వాటిని ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా సాధారణ సేవలతో పాటు కార్డియాలజీ, ఎండోక్రినాలజీ, ఆర్థోపెడిక్, రుమటాలజీ వంటి సేవలను అందిస్తున్నట్టు తెలిపారు.

పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపర్చడం, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ నుంచి పట్టణ పేదలను కాపాడడం, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేయడం.. ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశ్యమని, అదే సమయంలో ప్రత్యేక నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని, 365 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలు లభిస్తుండడంతో, ఈ కేంద్రాలకు రోగుల తాకిడి పెరుగుతున్నట్టు తెలిపారు.

గత ఏడాది ఏప్రిల్ 7 నుంచి ఈ ఏడాది జూన్ వరకూ 61,67,107 మంది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు పొందారని, ఈ సేవల ద్వారా రూ.733.61 లక్షల రూపాయల వరకూ పట్టణ ప్రాంత రోగులకు ఆదా అయినట్లు   తెలిపారు. 61.67 లక్షల మంది 4,85,169 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలు పొందారని, 35,39,837 పరీక్షలను లేబొరేటరీలలో నిర్వహించామని, రియల్ టైమ్ గవర్నర్ సిస్టమ్(ఆర్టీజీఎస్) ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయసేకరణలో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై ప్రజల నుంచి 98 శాతం సంతృప్తి స్థాయి వ్యక్తమైందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News