రణ్ బీర్ కపూర్: ప్రతి ఒక్కరికీ తెలుసు... నేనేమీ చెప్పాల్సిన పనిలేదు!: రణ్ బీర్-అలియా బంధంపై రిషి కపూర్
- తన పెళ్లి 27వ ఏట అయిందన్న రిషి
- ప్రస్తుతం రణ్ బీర్ కు 35 ఏళ్లు
- మనవలతో ఆడుకోవాలనుందన్న రిషి
సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి...హీరోయిన్లతో ఎఫైర్ విషయంలో ఆయన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తొలుత దీపికా పదుకునే, తర్వాత కత్రినా కైఫ్, ఇప్పుడు అలియా భట్. కత్రినా కైఫ్ తో విడిపోయిన తర్వాత..రణ్ బీర్ అలియాకు దగ్గరయ్యాడన్నది బీ టౌన్ టాక్. వీరి బంధానికి రెండు కుటుంబాలు కూడా సుముఖంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
అలియాతో రణ్ బీర్ బంధం, పెళ్లి వ్యవహారంపై మిడ్ డే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోమాట వెల్లడించాడు తండ్రి రిషి కపూర్. కొడుకు వీలైనంత త్వరగా పెళ్లిపీటలెక్కాలన్నది తండ్రి కోరిక. కొడుకు పెళ్లిచేసుకుని పిల్లల్ని కంటే..వారితో కలిసి ఆడుకోవాలనుకుంటున్నానని రిషి కపూర్ చెప్పాడు. తాను 27 ఏళ్లకే పెళ్లిచేసుకుని జీవితంలో స్థిరపడ్డానని, రణ్ బీర్ వయసు ఇప్పుడు 35 అని, కచ్చితంగా అతను పెళ్లి గురించి ఆలోచించాల్సిన సమయమిదని రిషి కపూర్ వ్యాఖ్యానించాడు.
తనకిష్టమైన వ్యక్తిని ఎవరినైనా రణ్ బీర్ పెళ్లిచేసుకోవచ్చని, తల్లిదండ్రులుగా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. మనవలు, మనవరాళ్లతో కలిసి ఆడుకోవాలన్నది తన కోరికని తెలిపాడు. తానెప్పుడూ రణ్ బీర్ తో ఈ విషయం మాట్లాడలేదని, కానీ....తన భార్య నీతూ కపూర్ తరచూ ఈ విషయం ప్రస్తావిస్తుంటుందని, అయితే రణ్ బీర్ మాత్రం మాట దాటవేస్తాడని రిషి తెలిపాడు.
రణ్ బీర్ పెళ్లి చేసుకుంటానని చెబితే.. అది తమకు ఎంతో సంతోషకరమైన విషయమవుతుందని, తమ సంతోషం అంతా...కొడుకు ఆనందం మీదే ఆధారపడి ఉందని రిషి అన్నాడు. రణ్ బీర్ తనకు తగిన అమ్మాయిని ఎంచుకోవడం ఎంతో కష్టమైన విషయం అన్నది తాను అర్థం చేసుకోగలనన్నాడు. సినిమా వాళ్లకు బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండవని, నటులకు తెలిసిన మహిళలంతా నటీమణులేనని, అందుకే సరైన భాగస్వామిని ఎంచుకోవడం వారికి కష్టంగా మారుతుందని రిషి అభిప్రాయపడ్డాడు.
రణ్ బీర్, అలియా బంధంపై ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. కొన్ని నెలల క్రితం అలియా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ తో ప్రేమ గురించి అడిగినప్పుడు సానుకూలంగా మాట్లాడింది. సోషల్ మీడియాలో అలియా, రణ్ బీర్ తల్లి నీతూకపూర్ ఇద్దరూ ఒకరిని ఒకరు పొగుడుకుంటూ ఉంటారు కూడా. ఈ విషయాలన్నింటినీ రిషికపూర్ వద్ద ప్రస్తావించగా...వారిద్దరి మధ్య ఏముందో.. ప్రతి ఒక్కరికీ తెలుసని, తానింకేమీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించాడు. మొత్తానికి రిషి కపూర్ మాటలు చూస్తోంటే..రణ్ బీర్, అలియా త్వరలోనే మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ 'బ్రహ్మాస్త్ర' సినిమాలో కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా విడుదల అవుతుంది.