bjp: బీజేపీ మెడలు వంచేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ఏకం కావాలి: కొలనుకొండ శివాజీ

  • పార్లమెంటు సాక్షిగా మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు
  • ఏపీపై బీజేపీ నిర్లక్ష్య  వైఖరి మరోసారి స్పష్టమైంది
  • మోదీ చేయాల్సింది వదిలేసి కాంగ్రెస్‌పై నిందలు వేశారు

ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ మెడలు వంచేందుకు జెండాలను పక్కనపెట్టి.. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సాంకేతికంగా అవిశ్వాసం నుంచి గట్టెక్కినా నైతికంగా ఓడిపోయారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం పార్లమెంటులో చేసిన చట్టాన్ని సైతం చెల్లని కాసుగా మార్చిన ఘనత మోదీకే దక్కిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ విషయంలో పార్లమెంటు సాక్షిగా అహంభావంతో పచ్చి అబద్ధాలు మాట్లాడారని, నిన్న లోక్‌ సభలో మోదీ సర్కారుపై కాంగ్రెస్‌, టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయినప్పటికీ... దేశాన్ని బీజేపీ ఏ విధంగా నాశనం చేస్తోందన్న విషయంలో కోట్లాది మంది భారతీయులకు స్పష్టత వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత వైఖరి ఏంటో మరోసారి సుస్పష్టమైందని, ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు ఉపన్యాసం చేశారని విమర్శించారు. మోదీ మాటలు బడ్జెట్‌ ప్రసంగాన్ని తలపించిందని, ఆంధప్రదేశ్ విషయంలో ఏమాత్రం కనికరం లేకుండా మాట్లాడారని అన్నారు. మోదీ చేయాల్సింది వదిలేసి కాంగ్రెస్‌పై నిందలు వేశారని, బీజేపీ అంగీకారం, ఆ పార్టీ చేసిన సవరణలతోనే విభజన చట్టం ఆమోదించబడిందన్న సంగతి, 2014 ఎన్నికలలో కష్టాలలో వున్న ఆంధ్రులకు ఆయన ఇచ్చిన హామీలు, చేసిన బాసలను మర్చిపోయి మాట్లాడారని, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు.

పార్లమెంటు ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయకుండా డ్రామాలాడుతున్నారని, కుంటిసాకులు చూపుతూ కావాలనే ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారనేది మరోసారి జాతి యావత్తు గ్రహించిందని, కాంగ్రెస్‌ పార్టీకి అధికారమే పరమావధి అని మాట్లాడిన మోదీ, 2019 ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రావడానికి ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారో అందరికీ తెలుసని అన్నారు.

దేశ ప్రజల మధ్య శాంతి, మత సామరస్యతను దెబ్బతీసేందుకు కూడా బీజేపీ వెనుకాడటం లేదని, రాజకీయపార్టీలు ఎప్పుడైనా అధికారం కోసమే ప్రయత్నిస్తాయన్న సంగతి ఆయనకు తెలియంది కాదని అన్నారు. కార్పోరేట్లకు కొమ్ము కాస్తూ, రైతులకు అన్యాయం చేస్తూ, సామాన్యులపై భారాలు మోపుతూ,ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ, అవినీతిపరులకు అండగా నిలుస్తూ చివరకు బ్యాంకులపై కూడా ప్రజలకు నమ్మకం పోయే వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ సర్కారును ఈ దేశ ప్రజలు క్షమించరని అన్నారు.

ఈ రోజున దేశంలో సంఘ సేవకులకు, సాహిత్య వేత్తలకు, శాంతి కాముకులకు, మత సామరస్యం కోరుకునే వారికి, మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, కనీ వినీ ఎరుగని రీతిలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, అకృత్యాలకు మోదీ చూపే పరిష్కారం ఏంటి? ఏం చర్యలు తీసుకున్నారు? అని  
ప్రశ్నించారు. అవినీతిని అంతం చేస్తామని పెద్ద నోట్ల రద్దు చేసి లక్షలాదిమంది కుటుంబాలను రోడ్ల పాలు చేశారని, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారు విదేశాలకు పారిపోయేందుకు సహకరించారని, నాలుగేళ్లలో మోదీ సర్కారు సాధించిందేమీ లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News