Parliament: కాంగ్రెస్ ది అపరాధమైతే బీజేపీది మహాపరాధం: గల్లా

  • హామీలు అమలు చేయకుండా ఏపీ నడ్డి విరిచారు
  • విభజనతో ఏపీకి మిగిలింది అప్పులు
  • హోదా ఇస్తామని చెప్పినందునే బీజేపీని ఆదరించిన ప్రజలు
  • నాలుగేళ్లుగా కాలయాపన, అశాస్త్రీయ కారణాలు

ఆంధ్రప్రదేశ్ ను పార్లమెంట్ తలుపులు మూసి అశాస్త్రీయంగా విభజించి కాంగ్రెస్ పార్టీ అపరాధం చేస్తే, నాడు కాంగ్రెస్ కు సహకరించి, ఆపై అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు ఏపీ నడ్డి విరిచిన బీజేపీ మహాపరాధం చేసిందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ నిప్పులు చెరిగారు. విభజన తరువాత రాజధాని లేని, ఆదాయంలో లోటున్న రాష్ట్రాన్ని ఇచ్చారని, ఆదాయం తెలంగాణకు, అప్పులు ఏపీకి మిగిలాయని, ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్రం మాట తప్పిందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతోనే బీజేపీని ఏపీ ప్రజలు ఆదరించారని, కానీ నాలుగేళ్లయినా కాలయాపన చేస్తూ, అశాస్త్రీయ కారణాలను చెబుతూ బీజేపీ విశ్వసనీయతను పోగొట్టుకుందని అన్నారు.

 విభజన తరువాత పారిశ్రామిక ఆదాయాన్ని ఏపీ ఎంతో నష్టపోయిందని, పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణలకన్నా ఇది తక్కువని, సేవా రంగం పరిస్థితి కూడా అంతేనని అన్నారు. 90 శాతం ఇనిస్టిట్యూషన్స్  తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయాయని, ఏపీకి ఒక్క జాతీయ స్థాయి విద్యా సంస్థ కూడా లేదని గుర్తు చేశారు. కేంద్రం కొన్ని సంస్థలను ప్రకటించినా, అవేవీ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిందని అన్నారు. సమస్యలన్నింటికీ కారణం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో దేశాన్ని పాలిస్తున్న ఎన్డీయేదేనని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఏపీ విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆ ప్రభావం ప్రజలపై పడినందునే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నది ఏపీ ప్రజలందరి అభిమతమని గల్లా జయదేవ్ చెప్పారు. 2014లో తెలుగుతల్లిని కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చిందని అన్నారు. ఆపై ఎన్నికల సమయంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి వచ్చి, కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని, తాము తల్లినీ, బిడ్డను కూడా బతికిస్తామని చెప్పినప్పుడు ఎంతో ఆనందం వేసిందని అన్నారు. అందుకే నాలుగేళ్ల పాటు మోదీ ఏదో చేస్తారని, తల్లిని రక్షిస్తారని వేచి చూశామని చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తే బీహార్ వంటి రాష్ట్రాలు కూడా అదే విషయాన్ని డిమాండ్ చేస్తాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని, ఇంతకన్నా అర్థరహితమైన కారణం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు.

ప్రధాని తిరుపతిలోని బాలాజీ సాక్షిగా, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల సాక్షిగా హోదాను ఇస్తామని ప్రమాణాలు చేశారని, అదే సమయంలో "మీకు స్కీమాంధ్ర కావాలా? స్కామాంధ్ర కావాలా?" అని అడిగారని, చంద్రబాబు వంటి డైనమిక్ నేతను ఎన్నుకోవాలని ప్రజలకు చెప్పారని గుర్తు చేశారు. జరుగుతున్న దంతా ప్రజలు చూస్తున్నారని, బీజేపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇవి తన మాటలు కాదని, ఇటువంటి ప్రధానిని ఎందుకు ఎన్నుకున్నామా? అని ఎన్నో కోట్లమంది ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. జయదేవ్ ప్రసంగం కొనసాగుతోంది.

More Telugu News