jc: అవిశ్వాస తీర్మానంపై చర్చకు నేను వెళ్లను: టీడీపీ ఎంపీ జేసీ

  • నేను వెళ్లినా, వెళ్లకపోయినా పెద్ద ప్రమాదం లేదు
  • ప్రధానిగా మోదీ ఉన్నంత వరకూ ఏమీ రాదు
  • తోటి ఎంపీలతో నాకు ఎలాంటి విభేదాలు లేవు

కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో తమ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్ర, సోమవారాల్లో ఉభయసభలకు తమ ఎంపీలందరూ హాజరు కావాలని ఆ విప్ లో ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పట్టించుకోవట్లేదు. విప్ జారీ చేసినప్పటికీ తాను ఢిల్లీకి వెళ్లేది లేదంటూ సొంత పార్టీకి షాక్ ఇచ్చిన జేసీ ప్రస్తుతం అనంతపురంలో ఉన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మేము ఎందుకు అవిశ్వాసతీర్మానం పెడుతున్నామన్న విషయాన్ని మా కొలీగ్స్  చాలా క్లియర్ గా చెబుతారు. కనుక, నేను వెళ్లినా, వెళ్లకపోయినా పెద్ద ప్రమాదం లేదు. నా అభిప్రాయం ప్రకారం, ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకూ ఏమీ రాదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు నేను హాజరు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికే తప్ప.. మేం సాధించేదేమీ ఉండదు. తోటి ఎంపీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్లందరూ నాకు మంచి మిత్రులు..వారితో ఎటువంటి విభేదాలు లేవు’ అని అన్నారు. ఈ సమావేశాలకు హాజరుకావడం లేదనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి చెప్పారా? అనే ప్రశ్నకు జేసీ స్పందిస్తూ, ఏమీ అవసరం లేదని అన్నారు.

కాగా, టీడీపీ ఎంపీల బృందానికి నాయకత్వం వహిస్తున్న సుజనా చౌదరిపై జేసీ అలక పూనినట్టు తెలుస్తోంది. సుజనా చౌదరి సొంతపోకడలు పోతూ, తనను పట్టించుకోవడం లేదని జేసీ భావిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే జేసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, పార్టీ వర్గాలు జేసీని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News