Chandrababu: 1500 రోజులు 15 నిమిషాల్లా గడిచిపోయాయి: సీఎం చంద్రబాబు
- దేశంలో సుపరిపాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్
- ఓ టీమ్ లా పనిచేస్తున్నాం
- రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఆనందం కూడా పెరగాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 1500 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఓ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం బాగుపడాలని తనను గెలిపించారని, 1500 రోజులు 15 నిమిషాల్లా గడిచిపోయాయని అన్నారు. దేశంలో సుపరిపాలనకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అని, పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఓ టీమ్ లా పనిచేస్తున్నామని, టీమ్ లీడర్ గా అందరినీ సమన్వయం చేస్తున్నానని, సవాళ్లకు భయపడకుండా విజన్ డాక్యుమెంట్ రూపొందించానని అన్నారు.
1500 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంగా ‘గ్రామ దర్శిని’, పార్టీ కార్యక్రమంగా ‘గ్రామ వికాసం’ నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఆనందం కూడా పెరగాలని, 2050 నాటికి ప్రపంచంలోనే ఏపీ అగ్రరాష్ట్రంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్యంలో మనం ముందున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, ఐదు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయబోతున్నామని అన్నారు.
బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని, ఇసుక దళారీ వ్యవస్థపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే టీడీపీపై బురదజల్లుతున్నాయని, కేసుల మాఫీ కోసం వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి వెళ్లాల్సిన కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యారని, వైసీపీకి సొంత మైకు, బీజేపీకి అద్దె మైకులా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీకి న్యాయం చేయడమే తన లక్ష్యమని, ఈ నెలలో ప్రకాశం జిల్లాలో మరో ధర్మపోరాటం చేస్తామని, లోక్ సభలో ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుందని వైసీపీ ఎంపీలు ముందుగానే రాజీనామా చేసి బయటకు వచ్చారని, బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే వారు రాజీనామా చేశారని ఆరోపించారు.