Telangana: స్వయం ఉపాధి కోసం రూ.205 కోట్లతో 16,479 మంది గిరిజనులకు ఆర్థిక సాయం: తెలంగాణ సీఎస్

  • కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం
  • స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ల ద్వారా శిక్షణ కూడా
  • గిరిజనులలో ఉన్న స్కిల్స్ ను గుర్తించాలి

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, ట్రైనింగ్ కేంద్రాలను స్పేషియల్ మ్యాపింగ్ (Spatial Mapping) చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా చౌంగ్తు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్కే జోషి మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన గిరిజన ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. విద్య, వైద్య సౌకర్యాలతో పాటు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న వివిధ విద్యా సంస్థల ద్వారా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

గిరిజన ప్రైమరీ పాఠశాలలు, అంగన్ వాడీల మధ్య సినర్జీ ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు ఉండేలా చూడాలన్నారు. గిరిజన విద్యా సంస్థల్లో పనిచేస్తోన్న సీఆర్‌పీలు అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అభిప్రాయసేకరణ చేయాలని, విద్యా పరమైన ప్రతిభను సమీక్షించాలని సూచించారు.

2017-18 విద్యా సంవత్సరానికి గానూ 2,28,000 మందికి పైగా విద్యార్థులకు ఆర్‌టీఎఫ్‌ (RTF), ఎంటీఎఫ్‌ (MTF) అందించామని, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యా నిధికింద 123 మందిని ఎంపిక చేశామని చెప్పారు. 2018-19 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ లలో 6 వేల మందికి ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించామని సీఎస్‌ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే ట్రైబల్ మ్యూజియంకు మరింత ప్రాచుర్యం కల్పించి ఎక్కువ మంది సందర్శించేలా చూడాలన్నారు.

స్వయం ఉపాధికి సంబంధించి 205 కోట్ల రూపాయలతో 16,479 మందికి ఆర్థిక సాయం అందించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గిరిజన శాఖ ద్వారా శిక్షణ పొందిన అనంతరం వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారి నుండి ఫీడ్ బ్యాక్ సేకరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ద్వారా గిరిజనులలో ఉన్న స్కిల్స్ ను గుర్తించి వారిలో ఉన్న ప్రతిభను మెరుగుపరచి, ఆర్థికంగా మరింత మేలు జరిగేలా చూడాలన్నారు. ఫ్రీ ఎక్సామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా మెరుగైన శిక్షణ అందించాలన్నారు.

గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా 2,28,175 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా 150 కోట్లతో 3,400 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో సాయం అందించాలని నిర్ణయించామన్నారు. ఎస్టీ, ఎస్డీఎఫ్ నిధుల వ్యయాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) భూములకు సంబంధించి రైతు బంధు చెక్కుల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News