VH: డీఎస్ ను మళ్లీ ‘కాంగ్రెస్’ లోకి రానివ్వమని నేను అనలేదు: వీహెచ్ వివరణ
- ఈ విషయాన్ని పీసీసీ కమిటీ నిర్ణయిస్తుంది
- బాలాపూర్ దేవతల గుట్టల్లో భూమి కబ్జాకు గురవుతోంది
- కబ్జాదారుల వెనుక ఎవరున్నారో సర్కార్ బయటపెట్టాలి
టీఆర్ఎస్ నేత డీఎస్ మళ్లీ ‘కాంగ్రెస్’లోకి వస్తామంటే తాము ఒప్పుకోమని, నాడు ‘కాంగ్రెస్’ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి ఆయన వెళ్లారని సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా, వీహెచ్ స్పందిస్తూ, డీఎస్ ను మళ్లీ కాంగ్రెస్ లోకి రానివ్వమని తాను అనలేదని సమర్థించుకున్నారు. డీఎస్ ను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలో వద్దో అనే విషయాన్ని పీసీసీ కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు.
ఇక బాలాపూర్ దేవతల గుట్టల్లో వందల ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందని, రేపు దేవతల గుట్టకు వెళ్లి భూములను పరిశీలిస్తానని చెప్పారు. కబ్జాదారుల వెనుక ఎవరున్నారో సర్కార్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కబ్జాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి కేటీఆర్ కు ఈ వ్యవహారం కనిపించడం లేదా? అని వీహెచ్ ప్రశ్నించారు.