imrah khan: టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఇమ్రాన్ ఖాన్, ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు!

  • ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా పాక్ నేతలు
  • టెర్రరిస్టులు దాడి చేసే అవకాశం ఉందన్న కౌంటర్ టెర్రరిజం అథారిటీ
  • ఇప్పటికే బిలావల్ భుట్టో కాన్వాయ్ పై దాడి

జూలై 25న పాకిస్థాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో పలువురు నేతలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని పాకిస్థాన్ కు చెందిన జాతీయ కౌంటర్ టెర్రరిజం అథారిటీ హెచ్చరించింది. భద్రతను పెంచాలని సూచించింది. టెర్రరిస్టుల హిట్ లిస్టులో తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్సంద్యార్ వలీ, క్వామీ వతన్ పార్టీ కి చెందిన అహ్మద్ ఖాన్ షెర్పావో, జమియత్ ఉలేమా ఇ ఇస్లాం ఫజల్ నేత అక్రమ్ దుర్రానీ, ఏఎన్పీ నేత అమీర్ హైదర్ మోటీలు ఉన్నారు.

వీరితో పాటు లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా లిస్టులో ఉండటం గమనార్హం. అల్లాహో అక్బర్ తెహ్రీక్ పార్టీ తరపును తల్హా సయీద్ ఎన్నికల బరిలోకి దిగారు. వీరితో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన నేతలు కూడా లిస్ట్ లో ఉన్నారు.

ఇప్పటికే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దాడి జరిగింది. కరాచీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో... కనీసం వంద మంది దాడికి తెగబడ్డారు. బిలావల్ వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ... రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కాన్వాయ్ లోని వాహనాలు దెబ్బతిన్నాయి. ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. 

More Telugu News