Chandrababu: కృష్ణా జిల్లా కిడ్నీవ్యాధి బాధితుల అంశం.. చంద్రబాబుకు లేఖ రాసిన రఘువీరారెడ్డి

  • కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధి బాధితులు
  • వ్యాధి బాధితుల సమస్యలు, పరిష్కారమార్గాలపై బాబుకు లేఖ
  • తక్షణం స్పందించాలని కోరిన రఘువీరారెడ్డి

ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరు నియోజక వర్గంలోని ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి బాధితుల విషయమై సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓ లేఖ రాశారు. కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలు, పరిష్కారమార్గాల గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబుకు రఘువీరా రాసిన లేఖ యథాతథంగా..

‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్ర ప్రదేశ్

విషయం: కృష్ణాజిల్లా తిరువూరు నియోజక వర్గం ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి బాధితుల సమస్య, పరిష్కార మార్గాల గురించి..

అయ్యా,

ఈ నెల రెండవ తేదీన ఏపీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం ఎ.కొండూరు మండలంలోని కొన్ని గ్రామాలలో పర్యటించి అక్కడి కిడ్నీ వ్యాధుల సమస్యపై అధ్యయనం చేయటం జరిగింది. మా అధ్యయనంలో వెల్లడైన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రాంత బాధితుల సమస్యల సత్వర, సానుకూల పరిష్కారం కోసం మీకు ఈ లేఖ రాస్తున్నాను.

మేం పర్యటించిన గ్రామాలలో ఈ కిడ్నీ వ్యాధి epidemic proportions లో వుంది. చీమల పాడు గ్రామ దళిత వాడలో 380 మంది జనాభాలో 16 మంది, దీప్లా నగర్ తండాలో 500 మంది జనాభాలో 72 మంది, మాన్ సింగ్ తండాలో 300 మంది జనాభాలో 22 మంది కిడ్నీ వ్యాధి బారిన పడిన వారున్నారు. ఈ గ్రామాలే కాక మరిన్ని ఇతర గ్రామాలలో బాధితులను కూడా కలిపితే అధికారిక లెక్కల ప్రకారమే ఎ.కొండూరు మండలంలో 480 మంది వ్యాధిగ్రస్తులు వున్నారు. వారిలో కొందరు చనిపోయారు. మరికొందరు డయాలిసిస్ చేయించుకుంటూ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

మా పరిశీలనలో, అక్కడి ప్రజా సంఘాల పరిశీలనలో అనధికారికంగా తేలిన విషయం ఏమిటంటే, బాధితుల సంఖ్య ఇంతకు మూడు రెట్లు ఎక్కువగా అంటే సుమారు 1200 పైచిలుకు ఉంటుందని. అంతే కాకుండా ఈ సమస్య కేవలం ఎ.కొండూరు మండలంలోనే గాక తిరువూరు, గంపల గూడెం మండలాలలో కూడా ప్రబలుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితికి గల కారణాలు, అక్కడ మంచి నీటి సరఫరాలో, వైద్య సదుపాయాలలో ఉన్న లోటుపాట్లు, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు మా అధ్యయనం మేరకు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. ఈ సమస్యకు ప్రధాన కారణం, నీటిలో ఉన్న భార ఖనిజ లవణాలు అని తోస్తున్నది. నీటిని శాస్త్రీయంగా ఎనాలిసిస్ చేయించి అసలు కారకాలు ఏమిటో ఇదమిత్థంగా తేల్చాలి. గత రెండేళ్ళ కాలంగానే ఆ ప్రాంతంలో ఈ వ్యాధి ప్రబలింది. ఈ రెండేళ్లుగా సాగర్ జలాలు ఆ ప్రాంతానికి రాక పోవటం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయాయి. లోతైన బోర్లలోని నీరు సిలికా వంటి భార ఖనిజ లవణాలతో కలుషితమయ్యే అవకాశం మెండుగా ఉంది. అందుచేత, సాగర్ జలాలు గతంలో వలె ఆ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. మరోవైపు రక్షిత మంచినీటి పథకం త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలి.

2. Epidemic స్థాయిలో కిడ్నీ వ్యాధి ఉన్నా దాన్ని handle చేసే స్థాయిలో వైద్య సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేవు. తిరువూరులో పేరుకి ఏరియా ఆసుపత్రి ఉన్నా14 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ఇద్దరు ఎనస్తీషియా డాక్టర్లు, ఒక చిన్న పిల్లల డాక్టర్ మాత్రమే రెగ్యులర్ డాక్టర్స్. ఒక గైనకాలజిస్ట్, మరో MBBS డాక్టర్ కాంట్రాక్ట్ బేసిస్ పై పని చేస్తున్నారు.

జనరల్ ఫిజీషియన్ అనధికార సెలవులో ఉన్నారు. ఇక ఇతర వైద్య సిబ్బంది విషయం చెప్పనవసరం లేదు. ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాలంటే తక్షణమే ఏరియా ఆసుపత్రి నుండి పీహెచ్ సీ లు, సబ్ సెంటర్ల వరకు వైద్యులు, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి. ఏరియా ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్ ను అందుబాటులో ఉంచాలి. డయాలిసిస్ సెంటర్ ను ఏర్పరచాలి. అవసరమైన మందులను సమృద్ధిగా, నిరాఘాటంగా అందుబాటులో ఉంచాలి. వైద్య పరీక్షా సౌకర్యాలను మెరుగు పరచాలి.

3. వ్యాధి తీవ్రత బయట పడిన కేసుల కంటే ఎక్కువగానే ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది. ఇంకా బయట పడని కేసులు చాలా ఉన్నాయి. అందుచేత ఆ ప్రాంతంలోని జనాభా అందరినీ స్క్రీనింగ్ చేయాలి.

4. బాధిత కుటుంబాలకు ఆర్థిక ప్యాకేజీ అమలు చేయాలి. దాంతోపాటు వ్యాధిగ్రస్తులకు అవసరమైన పోషకాహారం ప్రభుత్వమే అంగన్వాడీలు, సబ్ సెంటర్ల ద్వారా అందజేయాలి.

5. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.

6. వ్యాధి పీడితులందరికి 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి.

7. వ్యాధి పీడిత కుటుంబాలకు, ఆ ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలన్నిటికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

8. తిరువూరు, ఎ. కొండూరు, గంపలగూడెం ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.
     
పై విషయాలన్నిటిపై వెనువెంటనే చిత్తశుద్ధితో స్పందిస్తారని ఆశిస్తున్నాను.

డా.ఎన్. రఘువీరా రెడ్డి,

ఏపీసీసీ అధ్యక్షులు.

  • Loading...

More Telugu News