Chandrababu: జనవరి కల్లా మిగిలిన 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి: చంద్రబాబు
- పక్కా ఇళ్ల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి
- జులై 5వ తేదీన 3 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు
- ఇప్పటివరకు 5,80,849 ఇళ్ల నిర్మాణం పూర్తి
జులై 5వ తేదీన 3 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు చేస్తుండడం ఒక చరిత్రని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక పండుగలా సామూహిక గృహప్రవేశాలు జరపాలని, గతంలో లక్ష ఇళ్ల సామూహిక గృహ ప్రవేశం జరిపామని, ఇదే స్ఫూర్తితో మిగిలిన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. ఈ రోజు సంబంధిత అధికారులతో చంద్రబాబు.. పక్కా ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఇప్పటివరకు 5,80,849 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 8 లక్షల ఇళ్ల నిర్మాణం జనవరికల్లా పూర్తిచేయాలి. ప్రతినెలా 35 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. నెలకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. 2022 కల్లా రాష్ట్రంలో అందరికీ పక్కా ఇళ్లు ఉండాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలి.
గత 4 ఏళ్లలో నిర్మించిన ఇళ్లలో ఒక్కచోట కూడా అక్రమాలు జరగలేదు. ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నాం. పారదర్శకంగా పక్కాఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమందికి ఇళ్లు లేవు? ఎంతమందికి ఇళ్ల స్థలాలు లేవు? అనేది విశ్లేషించాలి. సాధికార మిత్రల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ భూములు లేని చోట ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నాం.
ప్రైవేటు భూముల కొనుగోళ్లకు రూ.750 కోట్లు కేటాయించాం. అందులో ఎస్సీలకు రూ.250 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాం. హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సమన్వయంగా పనిచేయాలి" అని సూచించారు.