BJP: రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్‌ను కోరిన ఏపీ బీజేపీ నేతలు
- ఏపీలో శాంతి భద్రతలు కరవయ్యాయి
- మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది
- రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతోంది
- మా పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు
బీజేపీ ఏపీ నేతలు ఈరోజు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఏపీలో శాంతి భద్రతలు కరవయ్యాయని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని వారు గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన తరువాత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో మానవహక్కుల ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతోందని ఆరోపించారు.
తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులపై దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. కొందరు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, ఏపీలో ప్రజలకు రక్షణ లేదని, అందుకే ఈ విషయాలపై గవర్నర్‌ను కలిసి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరామని అన్నారు.