ds: నేను ఆజాద్ ను కలిశానని చెప్పడం పచ్చి అబద్ధం: డీఎస్
- నాపై వస్తున్న ఆరోపణలు సరికావు
- నేను ఇటీవల ఢిల్లీ వెళ్లింది నా క్వార్టర్ రిపేర్ పనుల కోసం
- ఢిల్లీ వెళితే కాంగ్రెస్ నేతలు కాక, ఇంకెవరు కనిపిస్తారు?
టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) తిరిగి కాంగ్రెస్ గూటికే చేరతారనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా కమిటీ తీర్మానించింది. ఈ సందర్భంగా మీడియాతో డీఎస్ మాట్లాడుతూ, తనపై వస్తున్న ఆరోపణలు సరికావని, క్రమశిక్షణ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఇటీవల ఢిల్లీ వెళ్లానని, అక్కడ తన క్వార్టర్ రిపేర్ పని చూసుకుని వచ్చానని అన్నారు. ఢిల్లీ వెళితే కాంగ్రెస్ నేతలు కాక, ఇంకెవరు కనిపిస్తారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గులాం నబీ ఆజాద్ ను తాను కలిశానని చెప్పడం పచ్చి అబద్ధమని, టీఆర్ఎస్ లో చేరాక రాజకీయ నేతలను కలవడమే మానేశానని చెప్పారు. టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తనపై ఆరోపణలు చేస్తూ సీఎం కేసీఆర్ కు లెటర్ రాయకుండా ఉండాల్సిందని, తనతో మాట్లాడితే సరిపోయేదని అన్నారు.