USA: ట్రేడ్ వార్ ఎఫెక్ట్... అమెరికాను వీడుతున్న హార్లీ డేవిడ్ సన్... 'ఆశ్చర్యం' అన్న ట్రంప్!
- వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్
- ప్రతీకారంగా పన్నులు పెంచిన యూరోపియన్ యూనియన్
- అమెరికా నుంచి ప్లాంట్లను తరలించాలని నిర్ణయించిన హార్లీ డేవిడ్ సన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రభావం మరింత స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న మోటార్ సైకిల్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్ సన్ అమెరికాలో ఉన్న మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను విదేశాలకు తరలించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ప్రకటించగా, విషయం తెలుసుకున్న ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "అన్ని కంపెనీల్లో అమెరికాకు తెల్లజెండా చూపిన కంపెనీగా హార్లీ డేవిడ్ సన్ నిలిచింది. ఆశ్చర్యం" అని వ్యాఖ్యానించారు.
117 సంవత్సరాల చరిత్ర ఉన్న హార్లీ డేవిడ్ సన్ బైకులు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును తెచ్చుకున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ఇతర దేశాలు, అమెరికా నుంచి తమ దేశాలకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపైనా పన్నులను పెంచుతుండటంతో హార్లీ డేవిడ్ సన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త వెల్లడైన తరువాత స్టాక్ మార్కెట్లో హార్లీ డేవిడ్ సన్ వాటాల విలువ దారుణంగా పడిపోయింది. హార్లీ ఈక్విటీ వాటాల విలువ 6.4 శాతం దిగజారి 41.37 డాలర్లకు పడిపోయింది.
కాగా, గత శుక్రవారం నాడు అమెరికా నుంచి దిగుమతి అయ్యే మోటార్ సైకిళ్లపై ప్రస్తుతం విధిస్తున్న 6 శాతం పన్నును 31 శాతానికి పెంచుతున్నట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ఇంపోర్ట్ అయ్యే వాహనాలే టార్గెట్ గా ఈయూ ఈ కొత్త పన్నులను విధించింది. అంతకుముందు అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తులపై ట్రంప్ విధించిన అదనపు పన్నులకు ప్రతీకారంగానే ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది.