: పడక మీద నుంచే ప్రచారం!
పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల సభలో ఫోర్క్ లిఫ్ట్ కూలి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ప్రచారం మాత్రం ఆపలేదు. ప్రమాదంలో ఇమ్రాన్ తలకు, వెన్నుకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు ఆయన్ను కదలవద్దని సూచించారు. దీంతో, రేపు పాకిస్తాన్ లో జరిగే ఎన్నికల్లో ఆయన ఓటింగ్ కు కూడా దూరమవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరిసారిగా తన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలను, ప్రజానీకాన్ని ఉద్ధేశించి ఇమ్రాన్ ఆసుపత్రి బెడ్ పై నుంచే ప్రసంగించాడు.
ఇస్లామాబాద్ లో సుమారు 30 వేల మంది ఓ ర్యాలీకి హాజరవగా వారిని ఉద్ధేశించి వీడియో లింక్ ద్వారా ప్రసంగం సాగించాడు. దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దని సూచించాడు. మార్పు కోసం తపిస్తున్న తమకు ఓ అవకాశం ఇవ్వాలని వారిని అర్ధించాడు. అంతేగాకుండా, సరికొత్త పాకిస్తాన్ అవతరించేదాకా భగవంతుడు తనను తీసుకెళ్ళడని ఇమ్రాన్ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించాడు.