BJP: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత.. బీజేపీ మండిపాటు!
- ముషారఫ్ వ్యాఖ్యలకు మద్దతు
- కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్‌తో కలవాలని అనుకోవట్లేదు
- స్వాతంత్ర్యం కావాలనుకుంటున్నారు
కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారంటూ ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చేలా ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి, జమ్ముకశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ తాజాగా మాట్లాడుతూ... కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్‌తో కలవాలని అనుకోవట్లేదని, అయితే, స్వాతంత్ర్యం కావాలనుకుంటున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అన్నారని, ఆయన వ్యాఖ్యలు నిజమని, తాను కూడా అదే చెబుతున్నానని, కానీ అది సాధ్యం కాదని కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు.
సోజ్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని అన్నారు. 1991లో జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు సోజ్ కూతురును కిడ్నాప్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా స్వామి ప్రస్తావించారు. భారత్‌లో ఉండాలనుకునే వాళ్లు రాజ్యాంగ బద్ధంగా ఉండాలని హితవు పలికారు. సోజ్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు.