Chandrababu: సిలికాన్ వ్యాలీ అంటే అమెరికా.. ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలి: చంద్రబాబు
- రూ.500 కోట్ల వ్యయంతో ఎన్ఆర్‌టీ ఐకాన్ భవనానికి శంకుస్థాపన
- టవర్‌లో రివాల్వింగ్ గ్లోబ్ ఏర్పాటు చేయాలి
- తెలుగు వారి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పాలి
ఏపీ రాజధాని అమరావతిలో ఎన్ఆర్‌టీ ఐకాన్ భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ భవనానికి శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నిటా ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాక ఎగరాలని, అలాగే అమరావతిలో నిర్మిస్తున్న ఎన్‌ఆర్‌టి ఐకానిక్ టవర్‌లోనూ రివాల్వింగ్ గ్లోబ్ ఏర్పాటు చేయడంతో పాటు అందులో ప్రతి దేశం జెండా, ఆ దేశంలో మన తెలుగు వారు ఎందరున్నారో తెలిసేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
సిలికాన్ వ్యాలీ అంటే అమెరికా ఎలా గుర్తొస్తుందో.. ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలని, అందులోనూ అమరావతి గుర్తు రావాలని అన్నారు. ఇదేం అసాధ్యమైంది కాదని, గత నాలుగేళ్లుగా ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే తెలుగు వారిది ఓ విజయ గాథగా నిలవాలని, తెలుగు వారి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పేలా జాతి మొత్తం కదలి రావాలని అమరావతి వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.