Jagan: ప్రస్తుతం జగన్ వైపే ప్రజల మొగ్గు .. దానిని మార్చే శక్తి చంద్రబాబుకు ఉంది: ఉండవల్లి
- ఇప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయి
- పవన్ బలంపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం
- సీఎం రమేష్ తలపెట్టనున్న దీక్షకు మద్దతు కోరితే ఇస్తా
ఇప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని, ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయితే, జగన్ కు ఉన్న వేవ్ ను మార్చగలిగే శక్తి సామర్థ్యాలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి ఉన్నాయని అన్నారు.
జగన్ కు సరైన ఎన్నికల బృందం లేదని అభిప్రాయపడ్డ ఉండవల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా మాట్లాడారు. పవన్ ఇప్పుడే పూర్తి స్థాయి రాజకీయ అరంగేట్రం చేశారని, ఆయన బలంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని అభిప్రాయపడ్డారు. పవన్ బలమేంటో ముందుముందు తెలుస్తుందని, ఏపీకి నిధుల గురించి జనసేన పార్టీ ఇచ్చిన నివేదికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ కేటాయించాలని కోరుతూ సీఎం రమేష్ తలపెట్టనున్న దీక్ష గురించి ఉండవల్లి ప్రస్తావించారు. ఈ దీక్షకు తన మద్దతు కోరితే తప్పకుండా ఇస్తానని చెప్పారు.