Chandrababu: ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ర‌ఘువీరారెడ్డి లేఖ

  • నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి
  • అవి పరిష్కరించలేనంతటి పెద్ద విషయాలు కావు 
  • సర్కారు ఎందుకు పరిష్కరించటం లేదో అర్థం కావట్లేదు
  • పెంచలయ్యపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని 6 (ఏ) దేవస్థానములలో భక్తుల తలనీలాలు తొలగించే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనాలు పెంచాలని, వారిపై జరుగుతోన్న భౌతిక దాడులు ఆపాలని ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ రాశారు. "ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాల నాయీబ్రాహ్మణ బార్బర్స్ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ వారు నిన్న నన్ను కలిసి వారి సమస్యలను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

తీరా చూస్తే అవి ఏమంత పరిష్కరించలేని పెద్ద విషయాలు కూడా కావు. దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రికి, ఆ శాఖ అధికారులకు, ఆలయ ధర్మకర్తల మండలి బాధ్యులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు వారు ఎన్నిసార్లు ఎంతగా విజ్ఞప్తులు చేసుకున్నా ఎందుకు పరిష్కరించటం లేదో అర్థం కావటం లేదు. అసలే సామాజిక వివక్షకు గురవుతున్న క్షురక వృత్తిదారుల పట్ల ఇది ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం, వివక్ష కాదా? అని అడుగుతున్నాను.

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం బార్బర్ ఓలేటి రాఘవులుపై ధర్మ కర్తలమండలి సభ్యుడైన పెంచలయ్య 1.6.2018 వ తేదీన దుర్భాషలాడి భౌతిక దాడికి పాల్పడ్డాడు. సదరు పెంచలయ్య పూర్వాశ్రమంలో రౌడీ షీటర్ అని కూడా తెలుస్తోంది. అతనిపై చర్య తీసుకుని రాఘవులుకు 10 రోజులలోగా న్యాయం చేస్తామని స్వయంగా ధర్మ కర్తలమండలి అధ్యక్షులు, అధికారులు, స్థానిక ఎమ్మెల్సీ హామీ ఇచ్చి కూడా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోకపోవటం శోచనీయం. బడుగు బలహీన వర్గాలకు చెందిన రాఘవులుపై అన్యాయంగా దాడికి పాల్పడిన ఆ సభ్యునిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ధర్మ కర్తలమండలి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

విజయవాడ కనక దుర్గమ్మ గుడిలోని 97 మందితో సహా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని 6 (ఏ) దేవస్థానములైన 9 దేవస్థానాలలో సుమారు 620 మంది క్షురకులు పని చేస్తున్నారు. కేశ ఖండన టిక్కెట్లపై వచ్చే ఆదాయంలో కొంత భాగం మాత్రమే వారికి కేటాయించటం వల్ల ఒక్కొక్కరికి నెలకి ఐదారు వేలకి మించి ఆదాయం రాని పరిస్థితి నెలకొంది. ఈ రోజున్న అధికధరాఘాత పరిస్థితుల్లో అంత తక్కువ మొత్తంతో కుటుంబ పోషణ ఎలా సాధ్యం? ఎవరైనా భక్తులు సంతోషంగా పదో పరకో ఇస్తే తీసుకుంటే విజయవాడ గుడిలో లాగా రౌడీయిజానికి, దాష్టీకానికి గురి కావలసి వస్తోంది. ఈ తొమ్మిది దేవస్థానాలేగాక రాష్ట్రంలో ఉన్న మిగతా చిన్న దేవస్థానాల్లో క్షురక వృత్తి చేస్తూ సుమారు 2,500 మంది క్షురక కార్మికుల కుటుంబాలు దయనీయమైన స్థితిలో జీవనం సాగిస్తున్నారు.

కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కన్సాలిడేటెడ్ పే గా కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని వారు అడుగుతున్న కోరికలో న్యాయముంది. దానితో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరటం గొంతెమ్మ కోరికేమీ కాదు. అలాగే క్షురక వృత్తి చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు, రిటైర్ అయిన వారికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని కోరటం కూడా న్యాయ సమ్మతమే.

మరణించిన వారి కుటుంబాలలో ఒకరికి అర్హత మేరకు ఉద్యోగం కల్పించాలన్న కోరికా సరైనదే. వీటన్నిటి కొరకు కేశ ఖండన టిక్కెట్ల పైన వచ్చే ఆదాయంతో పాటు తలనీలాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో కూడా కొంత కేటాయించాలని వారు చేస్తున్న మనవి ఎంతో అర్థవంతంగా ఉంది. తలనీలాల విక్రయం ద్వారా కోటానుకోట్ల ఆదాయం వస్తుందన్నది జగమెరిగిన సత్యం. అది కాంట్రాక్టర్ల పరమై దుర్వినియోగం అవుతుందన్నది బహిరంగ రహస్యం. దాంట్లో కొంతమేరకైనా క్షురక వృత్తి దారులకు చెందటం న్యాయం, ధర్మం. మొత్తానికి మొత్తం ధనిక కాంట్రాక్టర్లకు దోచి పెట్టటం అక్రమం, అన్యాయం, ధర్మ విరుద్ధం.

మా పార్టీ బీసీల పార్టీ, నేను బీసీల ఉద్ధారకుణ్ణి అని చెప్పుకుంటున్న మీరు బీసీలలో అత్యంత అణగారిన బీసీ కులమైన నాయీబ్రాహ్మణుల సమస్యలను అడక్కుండానే స్వయంగా పరిష్కరించాల్సింది పోయి వాళ్లు దీనంగా అడుగుతున్నా పట్టించుకోక పోవటం దారుణం, నయవంచన, నమ్మక ద్రోహం. ఇప్పటికైనా వారి సమస్యలను  పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది" అని లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News