Chandrababu: బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలపై ఇంతకన్నా రుజువులు ఏం కావాలి: చంద్రబాబు
- ఢిల్లీలో బీజేపీ నేతలతో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ
- ఇది కుట్రలకు పరాకాష్ట
- పీఎంవోలో విజయసాయిరెడ్డి ఉన్నట్లు గతంలోనూ ఫొటోలు
- మోదీని జగన్ ఎందుకు నిలదీయట్లేదు?
కడప ఉక్కు పరిశ్రమ కోసం తమ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు టీడీపీ ఎంపీలంతా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈరోజు అమరావతిలో టీడీపీ ఎంపీలు, మంత్రులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడంపై కేంద్ర సర్కారుని నిలదీయాలని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించాలని, అలాగే రాజధాని అమరావతికి నిధులు విడుదలయ్యేలా ఒత్తిడి చేయాలని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ కుట్రలకు పరాకాష్ట అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీఎంవోలో విజయసాయిరెడ్డి ఉన్నట్లు గతంలోనూ పలు ఫొటోలు వచ్చాయని అన్నారు. బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలపై ఇంతకన్నా రుజువులు ఏం కావాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీతో వైసీపీ వ్యవహరిస్తోన్న తీరు అభ్యంతరకరమని అన్నారు. ప్రధాని మోదీని జగన్ ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు.