Chandrababu: చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన వైసీపీ
- ఈ ఛార్జిషీట్ ని, టీడీపీ మ్యానిఫెస్టోను సరిచూసుకోవాలి
- ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారు
- నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం
సీఎం చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైసీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వైసీపీ విడుదల చేసిన ఛార్జిషీట్, టీడీపీ మ్యానిఫెస్టోలను దగ్గర పెట్టుకుని సరిచూసుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తానని బాబు ఊదరగొట్టారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిల పడ్డారని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని వ్యాఖ్యానించారు. ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాలను చంద్రబాబు పెంచి పోషించారని, బాబు పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని విమర్శించారు.