Saudi Arabia: కేరళ ఉత్పత్తులపై బ్యాన్ విధించిన సౌదీ అరేబియా

  • విదేశాలకు పాకిన నిపా వైరస్ భయం
  • కేరళ నుంచి వెళ్లిన 100 టన్నుల ఉత్పత్తులకు నో ఎంట్రీ
  • ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16

కేరళను వణికిస్తున్న నిపా వైరస్ యావత్ భారత దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. కేరళ నుంచి ఎవరు వచ్చినా అనుమానంగా చూసే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై గల్ఫ్ దేశం సౌదీ అరేబియా నిషేధం విధించింది. పళ్లు, కాయగూరలను బ్యాన్ చేసింది.

100 టన్నుల ఫలాలు, వెజిటబుల్స్ తో పాటు వివిధ తాజా ఉత్పత్తులను దేశంలోకి అనుమతించకుండా విమానాశ్రయంలోనే ఆపేసినట్టు యూఏఈ అధికారులు వెల్లడించారు. మరోవైపు యూఏఈలో ఉన్న వీపీఎస్ హెల్త్ కేర్ అనే సంస్థ నిపా వైరస్ కు సంబంధించిన మెడిసిన్స్ ను ఒక విమానం ద్వారా కేరళ ప్రభుత్వానికి పంపింది.

నిపా వైరస్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎన్సిఫాలిటిస్ అనే జబ్బు వస్తుంది. దీని కారణంగా మెదడు వాపునకు గురవుతుంది. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం రావడం, దగ్గు, తల నొప్పి, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, అయోమయంలాంటి లక్షణాలు కనపడతాయి.

ఇప్పటి వరకు నిపాకు సంబంధించి కేరళలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 16 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో ఇద్దరు కోజికోడ్ లోని ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మరో 2వేల మందిని అనుమానితులుగా గుర్తించి, చికిత్స అందిస్తున్నారు. 

More Telugu News