Andhra Pradesh: రూ.వేల కోట్లతో డొలేరా నగరం నిర్మిస్తున్నారు.. అమరావతికి మాత్రం సహకరించట్లేదు: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

  • ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోంది
  • చర్చలకు భారతీయ జనతా పార్టీ నేతలు సిద్ధమేనా?
  • విశాఖ-చెన్నై కారిడార్ కు ఎందుకు నిధులివ్వడంలేదు?
  • అమరావతి నిర్మాణంపై బీజేపీ నేతలు అవహేళన చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోందని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు అన్నారు. ఏపీకి వచ్చిన నిధులపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చలకు భారతీయ జనతా పార్టీ నేతలు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. కేంద్రానికి ఉత్తరాది ప్రాజెక్టులపై ఉన్న ప్రేమ దక్షిణాది వాటిపై లేదన్నారు. డొలేరా నగరం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణాల డిజైన్లను విదేశీయులతో చేయిస్తూ, అమరావతి నిర్మాణంపై బీజేపీ నేతలు అవహేళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అమరావతిలోని ఏపీ సచివాలయంలోని నాలుగోబ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుటుంబరావు మాట్లాడారు. బీజేపీ నాయకుడు జీవీఎల్ నర్సింహారావు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డొలేరా అనే నగరం ఢిల్లీ-ముంబై కారిడార్ లో భాగంగా చేపట్టారన్నారు. ఈ కారిడార్ లో 8 నగరాలు ఉన్నాయన్నారు. అవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలేనన్నారు.

ఢిల్లీ-ముంబై కారిడార్ అభివృద్ధిపై 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఏ నగరాన్ని అభివృద్ధి చేయాలి? ఎంత నిధులు కేటాయించాలి? అన్న దానిపై నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి, రాజస్థాన్ లో 3 నగరాలకు అవకాశమిచ్చారన్నారు.

డొలేరా నగర అభివృద్ధికి డిల్లీ-ముంబై కారిడార్ కు ట్రస్టు రూపేణా రూ.17 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఢిల్లీ-ముంబై కారిడార్ పరిధిలో ఉన్న రాష్ట్రాలు ఎటువంటి నిధులివ్వక్కర్లేకుండా భూములిస్తే చాలు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి ఉచితంగా నిధులివ్వడానికి కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. రూ.17 వేల కోట్లతో పాటు డిల్లీ-ముంబై కారిడార్ అథారిటీ మరో రూ.36 వేల కోట్లు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చిందన్నారు.  దాదాపు రూ.50 వేల కోట్లకు పైగా నిధులను ఆ 8 నగరాలకు ఇచ్చిందన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణంపై బీజేపీ నాయకులు మరో అభాండం వేస్తున్నారని కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ మాస్టర్ ప్లాన్, డిజైన్లు అంటున్నారని, ఇండియాలో డిజైన్లు చేసేవారు లేరా? అని తెలివిగా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు. డొలేరా నగరం డిజైన్లను పూర్తిచేయడానికి సింగపూర్ సంస్థ మూడేళ్ల సమయం తీసుకుందన్నారు. ఆ నగర నిర్మాణం సింగపూర్ సంస్థతో జాయింట్ వెంచర్ కూడా తీసుకుందన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ రూపకల్పనచేసే వారు ఇండియాలోకాని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాని లేరా? అని కుటుంబరావు ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ డిజైన్ ను విదేశాలకు చెందిన టర్నర్ సంస్థకు అప్పగించారన్నారు. అదే అమరావతి రాజధాని నిర్మాణంలో కేవలం 6.7 స్క్వేర్ కిలో మీటర్లలో సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పుబడుతున్నారు.

మరి సింగపూర్ సంస్థలతో డొలేరా నగరం అభివృద్ధి పై చేసుకున్న ఒప్పందాలపై ఏమంటారని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. డొలేరాపై తామెటువంటి అభాండాలూ వేయడం లేదన్నారు. ఢిల్లీ-ముంబై కారిడార్ లో 8 నగరాలకు ఏ విధంగా నిధులిస్తున్నారు? విశాఖ-చెన్నై కారిడార్ కు ఎందుకు నిధులివ్వడం లేదు? అని కుటుంబరావు ప్రశ్నించారు.

ఏడీబీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ద్వారా వచ్చిన నిధులతో విశాఖ-చెన్నై కారిడార్ ను అభివృద్ధిచేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు కావాల్సిన రాష్ట్రాలు ఢిల్లీ-ముంబై కారిడార్ లో ఉన్నాయని, అందుకనే ఆ కారిడార్ అభివృద్ధికి నిధులు కుమ్మరిస్తోందని అన్నారు. కృష్ణపట్నం పోర్టును చెన్నై–బెంగళూరులో చేర్చి అభివృద్ధి చేస్తున్నామని జీవీఎల్ నర్సింహారావు అన్నారని, అయితే ఇంతవరకు చెన్నై-బెంగళూరు కారిడార్ లో కష్ణపట్నం పోర్టును చేర్చిన తరువాత ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని కుటుంబరావు ప్రశ్నించారు. ఏపీ మీదుగా వెళ్లే విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంతవరకూ ఏపీకి లబ్ధి కలిగే నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ను దోషిగా చూపే బదులు బీజేపీ నేతలు తమ నిజాయతీని నిరూపించుకోండని అన్నారు.

  • Loading...

More Telugu News