Chandrababu: చంద్రబాబు పట్టించుకోకపోతే రాష్ట్రం మూడు ముక్కలవుతుంది: పవన్
- విజయనగరం జిల్లా పార్వతీపురంలో పవన్
- రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా ఏపీ విడిపోతుంది
- హైదరాబాద్లో చేసిన తప్పే మళ్లీ ఇక్కడ చేస్తున్నారు
- ఉద్ధానం సమస్య జనసేన వల్లే వెలుగులోకి వచ్చింది
అమరావతి, విజయవాడ, గుంటూరులోనే అభివృద్ధి చేస్తే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమం మొదలుతుందని, ఇతర ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మూడు ముక్కలవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈరోజు విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలా ఇక్కడ కళింగాంధ్ర ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉదని అన్నారు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పరిశ్రమలు, ఉద్యోగాలు, సాగునీరు లేవని పవన్ అన్నారు. అప్పట్లో హైదరాబాద్లో చేసిన తప్పే మళ్లీ ఇక్కడ చేస్తున్నారని, అభివృద్ధి ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్ధానం సమస్య జనసేన వల్లే బయటకు వచ్చిందని, నాలుగేళ్ల క్రితం పెట్టిన పార్టీ ఇంత చేయగలిగినప్పుడు ఇన్నేళ్లుగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయని ప్రశ్నించారు.