: ఈ రోబోలు మీ 'వాసన' పట్టేస్తాయి!
కొదమసింహం సినిమాలో మోహన్‌బాబు చేసిన సుడిగాలి అనే కామెడీ పాత్ర మీకు గుర్తుందా? సదరు సుడిగాలి ఎక్కడ అడుగు పెడితే అక్కడ దుర్వాసన వెల్లువెత్తిపోతుంటుంది. ఆ పరిసరాల్లో జనం యావత్తూ అది భరించలేక పారిపోతుంటారు. అయితే.. సదరు సుడిగాలికి మాత్రం అది కమ్మగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అదే నిజం. ఎందుకంటే మన శరీరం నుంచి, నోరు కాళ్లనుంచి వచ్చే దుర్వాసన మనకు సరిగ్గా తెలియదు. కానీ పక్కవాళ్లు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్ శాస్త్రవేత్తలు ఓ హ్యూమనాయిడ్‌ను, రోబో కుక్కను తయారుచేశారు. ఇవి దుర్వాసన గురించి మనల్ని హెచ్చరిస్తాయి.
క్రేజీలేబో అనే రోబో తయారీ సంస్థ, కిటక్‌షు నేషనల్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు వీటిని రూపొందించారు. హ్యూమనాయిడ్ అనేది ఓ అమ్మాయి తలలా ఉంటుంది. అది మన శ్వాసలోని దుర్వాసన గురించి చెబుతుంది. మంచి వాసన ఉంటే.. 'నిమ్మజాతి పండ్ల వాసన వస్తోంది' అంటుంది. అదే దుర్వాసన వస్తోంటే 'యాక్, నీ నోటినుంచి దుర్వాసన వస్తోంది' అని హెచ్చరిస్తుంది. కవోరి చాన్ అనే ఈ అమ్మాయి హ్యూమనాయిడ్ దుర్వాసనను దశల వారీగా కూడా విశ్లేషిస్తుంది. దుర్వాసన వస్తోంది అనడం కంటె ఎక్కువ వాసన ఉంటే 'తట్టుకోలేకపోతున్నా' అంటుంది. అంతకంటె దారుణంగా ఉంటే 'ఎమర్జన్సీ' అని హెచ్చరిస్తుంది.
షుంటారో కున్ అనే పేరుగల రోబో కుక్క కూడా కాళ్లనుంచి, సాక్సుల నుంచి వచ్చే వాసనను ఇలాగే పసిగట్టి చెబుతుంది. వాసన బాగుంటే వ్యక్తి మీదకు ఎగబడుతుంది. బాగాలేకపోతే.. మొరుగుతుంది. దుర్వాసన ఎక్కువైతే కిందపడిపోయి మూలుగుతుంది. మరీ దారుణంగా ఉంటే.. స్పృహ కోల్పోతుంది. మొత్తానికి మనకు తెలియని మనలోని దుర్వాసనల్ని పసిగట్టే ఈ రోబోలు చాలా బాగున్నాయి కదా?