Jagan: రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు!: మండిపడ్డ చంద్రబాబు
- మెగా ఫుడ్ పార్క్ ను జగన్ వ్యతిరేకిస్తున్నారు
- ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని జగన్ అడగడం విడ్డూరం
- ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం స్పందించాలి
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఆక్వా ధరల పతనంపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మెగా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకించే జగన్.. ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఒకవైపు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్, రైతు సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం స్పందించాలని, కేంద్ర వాణిజ్యమంత్రితో మాట్లాడాలని సీఎస్ దినేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు ఓ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. తక్షణమే ఢిల్లీ వెళ్లి సురేష్ ప్రభుతో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి ఆదినారాయణరెడ్డిని ఆదేశించారు. కాగా, ఈ నెల 26న ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో సమావేశం కానున్నట్టు చంద్రబాబు చెప్పారు.