: పాకిస్తాన్ ఎన్నికల 'వేడి'కి పులి బలైపోయింది
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పార్టీ పీఎమ్ఎల్-ఎన్ కు చిహ్నంగా పులిని ఎంచుకోవడమే కాదు, ప్రచారంలోనూ నిజమైన పులినే వినియోగిస్తూ వీరోచితంగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు ఇప్పటివరకు. పైగా, షరీఫ్ మహాశయుడు తనను తాను 'షేర్' గా అభివర్ణించుకునేవారు. ఇక విషయంలోకి వస్తే, షరీఫ్ కుమార్తె ఎన్నికల ప్రచారంలో ఈ తెల్లపులిని ఎక్కువగా వెంట తీసుకెళ్ళేది. పాపం, పాక్ లో ప్రస్తుతం మండే ఎండలకాలం కావడంతో పులికి వడదెబ్బ తగిలి ప్రాణం విడిచింది. ఎండ వేడిమికి తాళలేక నిస్త్రాణగా పడి ఉన్న పులిని లాహోర్ లోని వెటర్నరీ యూనివర్శిటీకి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది.
ఇదిలావుంటే, అన్యాయంగా ఓ జంతువు ప్రాణం తీశారని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచుర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఆక్రోశం వ్యక్తం చేసింది. అంతేగాకుండా ఈ ఉదంతంపై లాహోర్ హైకోర్టులో తన కార్యకర్తతో పిటిషన్ దాఖలు చేయించాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నిర్ణయించింది.