bjp: రేపటి వరకూ ఆగండి... మా బలం ఏంటో చూపిస్తాం: బీజేపీ కర్ణాటక విభాగం ప్రకటన
- మెజారిటీ నిరూపించుకుంటాం
- తగిన సంఖ్యాబలం ఉంది
- జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
- ఆరు కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వచనాలు మాకున్నాయి
సభలో బలం నిరూపించుకునే విషయంలో బీజేపీ కర్ణాటక విభాగం ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసింది. రేపటిలోగా మెజారిటీ నిరూపించుకోవాలని బీజేపీ నేత యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ రోజు సంచలన తీర్పు వెలువరించిన విషయం విదితమే. దీనిపై బీజేపీ కర్ణాటక విభాగం ట్విట్టర్లో స్పందించింది. బలపరీక్షలో నెగ్గుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ప్రకటించింది.
జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న విషయం వారికి తెలుసునని, అది రేపు ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొంది. మా బలంపై సందేహం ఉన్న వారికి చెప్పేదొకటే, 'వేచి చూడండని' అని పోస్ట్ లో పేర్కొంది. ఆరు కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వచనాలు తమకు ఉన్నాయని, వారి దీవెనలను గౌరవిస్తామని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రకటించింది.