Chandrababu: ఆ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే పోటీకి మేం రెడీ!: స్పష్టం చేసిన చంద్రబాబు
- వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు
- లాలూచీలో భాగంగానే రాజీనామాలు
- సిద్ధంగా ఉండాలంటూ నేతలకు పిలుపు
ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాలులో శుక్రవారం నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను జూన్ 2వ తేదీలోపు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయని, అదే జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు.
వైసీపీ నేతలు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో రాజీనామా చేయలేదని, బీజేపీ-వైసీపీ లాలూచీలో భాగంగానే రాజీనామాలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే కేంద్రం కక్ష సాధిస్తోందని అన్నారు. వారు ఏ వైపు నుంచైనా మన మీదకు రావొచ్చని, కాబట్టి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదాతోపాటు కేంద్రం ఇచ్చిన హామీల సాధనకు చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఎంపీలు, ముఖ్య నేతలతో రాజకీయ వ్యూహాత్మక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.