Tollywood: ఇండస్ట్రీని శాసించడం ఏ ఒక్కరి వల్లా కాదు!: తమ్మారెడ్డి భరద్వాజ
- ఇండస్ట్రీకి కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా కలుస్తుంది
- ఇండస్ట్రీ ఏ ఒక్క ఫ్యామిలీది కాదు
- ఇండస్ట్రీతో పాటు మీడియా కలిసి ఒక గొంతుకగా నిలబడాలి
ఇన్నాళ్లూ చిత్ర పరిశ్రమ - మీడియా పాలూనీళ్లలా కలిసున్నాయి కానీ, కొంతమంది వ్యక్తులు ఈ రెండింటిని వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని.. అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
‘నా ఆలోచన’ లో ఆయన మాట్లాడుతూ, ‘ఈ మధ్య కాలంలో అందరూ అపోహలు పడుతున్నారు! ఒక పక్క మీడియా, మీడియా మీద సోషల్ మీడియా, సోషల్ మీడియా మీద ఎలక్ట్రానిక్ మీడియా..ఇలా ఒకరిపై ఒకరికి అపోహలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల్లో.. ‘నా మీద చిరంజీవిగారు మీటింగ్ పెట్టారు’, ‘అన్నపూర్ణ స్టూడియోలో మీటింగ్ జరిగిందట’, ‘ఏదో ఛానెల్ ని బ్యాన్ చేస్తారట’..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వచ్చాయి. ఇండస్ట్రీకి కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా కలుస్తుంది. కచ్చితంగా కష్టమొచ్చింది. ఒక సమస్యను గురించి పరిష్కరించాల్సిన అవసరం వచ్చింది. ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
ప్రతి సమస్య పరిష్కారం కోసం కూర్చోవడం కుదరదు. ఏదో ఒకసారి అందరికీ మూడ్ వస్తుంది..ఆ మూడ్ వచ్చింది.. కలుస్తున్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ‘మీడియాను బ్యాన్ చేద్దామనుకుంటున్నారు’ అని రాసేశారు. ఇండస్ట్రీని శాసించడం ఏ ఒక్కరి వల్లా కాదు. ఏ ఒక్క ఫ్యామిలీది ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీలో ఫ్యామిలీలు ఉండొచ్చు కానీ, ఫ్యామిలీలకు ఇండస్ట్రీలు లేవు! ‘ఇండస్ట్రీలోని ఆ ఫ్యామిలీలు చెప్పినట్టు చేస్తున్నారు’ అనేది వదంతి. ఆ వదంతిని నమ్మి..బాధ్యత గల మీడియా స్పందించడం కరెక్టు కాదు!’ అని సూచించారు.
‘సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కలిసి ఒక గొంతుగా నిలబడితే బాగుంటుంది. అందుకోసం, అందరం ప్రయత్నం చేద్దాం కానీ, ఒకరిపై మరొకరు రాళ్లేసుకోవడానికి ప్రయత్నం చేయడం కరెక్టు కాదని నా భావన. ఈ విషయం చెప్పాలని పించింది..చెప్పాను. మళ్లీ, దీని మీద మీరు (మీడియా) తిట్టుకున్నాగానీ నాకు అభ్యంతరం, బాధ లేవు’ అని తమ్మారెడ్డి అన్నారు.