Chandrababu: ఎన్నికలు దగ్గర కొచ్చినప్పుడే చంద్రబాబుకు దళితులు గుర్తుకొస్తారు!: వైఎస్ జగన్
- కృష్ణా జిల్లా పెరికగూడెంలో ప్రజాసంకల్ప యాత్ర
- దళితుల పట్ల వివక్ష కనిపిస్తోంది
- ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ ఛార్జీ ధరలను ఇంతవరకూ పెంచలేదు
- ‘దళిత ఆత్మీయ సమ్మేళనం’లో పాల్గొన్న జగన్
ఎన్నికలు సమీపించినప్పుడే చంద్రబాబుకు దళితులు గుర్తుకొస్తారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెరికగూడెంలో ‘దళిత ఆత్మీయ సమ్మేళనం’లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దళితుల పట్ల వివక్ష కనిపిస్తోందని, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దళితులు పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘మంచి అన్నది మాల అయితే.. మాల నేనవుతా’ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని జగన్ సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ ఛార్జీ ధరలను సూచిక ప్రకారం పెంచుతామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకూ పెంచకపోగా, అడ్డగోలుగా ప్రభుత్వ హాస్టళ్లను మూసివేయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలవుతుందా? అని ప్రశ్నించిన జగన్, కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని అన్నారు.
సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోతే శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారని, మరి, ఆ నిధులు సక్రమంగా ఖర్చు కాకపోతుంటే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు లాక్కుంటున్నారని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.5 కోట్ల వడ్డీలేని రుణం ఇస్తామని చంద్రబాబు చెప్పారని..మరి, వడ్డీలేని రుణాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.