Congress: ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే వెంటనే శిక్షిస్తారా?.. ఇది ప్రజాస్వామ్యమేనా?: కాంగ్రెస్
- త్వరగా శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
- ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోవద్దు
- పార్టీల్లో ఉన్న మృగాళ్లపై కూడా కఠినంగా వ్యవహరించాలి
‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ప్రదర్శన చేసి, అనంతరం బహిరంగ సభ నిర్వహించి పలువురు ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. అది సర్కారు కార్యక్రమమా? లేక పార్టీ కార్యక్రమమా? అని నిలదీసింది.
ఆ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ... ఇది ప్రభుత్వ కార్యక్రమమైతే విపక్ష నాయకులను ఎందుకు పిలవ లేదని ప్రశ్నించారు. అలాగే, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వెంటనే శిక్షిస్తామని చంద్రబాబు అంటున్నారని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచి పోవద్దని హితవు పలికారు. నిందితులకు త్వరగా శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మృగాళ్లపై కూడా కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు.